ఆర్టికల్ -3, దేశ సరిహద్దుల నిర్ణయంలో కేంద్రానికి సర్వహక్కులు కట్టబెట్టే ఆర్టికల్ ఇది. రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే.. పార్లమెంటులో సాధారణ మెజారిటీ చాలునని ఈ ఆర్టికల్ చెబుతుంది. సరిహద్దులు మార్చే విషయంలో సంబంధిత రాష్ట్రాల అనుమతి ఏమాత్రం అవసరం లేదని ఈ ఆర్టికల్ ద్వారా జరిగిన రాష్ట్రాల ఏర్పాటు ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఆర్టికల్ పై సీమాంధ్ర, తెలంగాణ నాయకులు విమర్శలు గుప్పించుకుంటున్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపేందుకు అవకాశం కల్పించే.. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014 సవరణ చట్టానికి లోక్ సభ మందబలంతో ఆమోదముద్ర వేసిందని.. కనీసం తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం తీసుకోలేదని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఈ అంశంపై తెలంగాణలో జంటిల్ పొలిటీషన్ గా పేరుకున్న జైపాల్ రెడ్డి కూడా కేంద్రం తీరుపై మండిపడ్డారు. తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండా ముంపు మండలాలను ఆంధ్రలో కలపడం నియంతృత్వమవుతుందన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు స్పందించారు. మరి ఇదే ఆర్టికల్ ప్రకాశం రాష్ట్రవిభఝన జరిగినప్పుడు.. జైపాల్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. విభజన బిల్లును తిరస్కరించి పంపినా.. విభజన ఆగలేదన్న విషయాన్ని హరిబాబు గుర్తు చేశారు. అప్పుడు కేంద్ర నిర్ణయాన్ని సంపూర్ణంగా హర్షించిన జైపాల్ రెడ్డి ఇప్పుడెలా అభ్యంతరం చెబుతున్నారని హరిబాబు నిలదీశారు. ఏది తమకు అనుకూలంగా ఉంటే.. దాన్ని సమర్థించడం.. తమకు నచ్చనిదాన్ని వ్యతిరేకించడం రాజకీయ నాయకులకు సహజమే. కాకపోతే.. ఇక్కడ విభజన చట్టం ఆమోదించడం విషయంలో.. ముంపు మండలాలు కలిపేయడంలో కొంత తేడా ఉన్న సంగతి గమనించాలి. అప్పుడు ఏపీ అసెంబ్లీ తిరస్కరించి పంపినా.. కనీసం రాష్ట్రం అభిప్రాయం తీసుకున్నారు. కానీ ఈసారి అలాంటి ప్రయత్నం జరగలేదు. ఎలాగూ లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి.. ముంపు మండలాల కలిపివేతపై తెలంగాణ అభిప్రాయం కూడా తీసుకుని ఉండాల్సింది. ఆ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కనుక ఫార్మాలిటీ పాటించినట్టు ఉండేది. మరో విషయం ఏమిటంటే.. విభజన బిల్లును 23 జిల్లాల్లో కనీసం 10 జిల్లాల తెలంగాణ ప్రజలైనా సమర్థించారు. కానీ ఈ ముంపు మండలాల బిల్లును.. ఆ ముంపు మండలాల్లో ఏ ఒక్క గ్రామం కూడా సమర్థించకపోవడం గమనించాలి. ఏదేమైనా.. రాష్ట్ర విభజన, ముంపు మండలాల కలిపివేత ముందుగానే నిర్ణయించినవే.. కాబట్టి.. ఈ విషయంలో ఒకరికి మోదం.. మరొకరికి ఖేదం తప్పవు. ఎవరు ఏమనుకున్నా.. జరగాల్సింది జరిగిపోయింది. ఇకనైనా నేతలు సంయమనం పాటించి రెండు రాష్ట్రాల మధ్య సృహుద్భావ వాతావరణం కల్పిస్తే రెండు రాష్ట్రాలకూ మంచిది

మరింత సమాచారం తెలుసుకోండి: