ఏపీ సీఎం చంద్రబాబుకు మొదటినుంచి బాబాలు, స్వామీజీల పిచ్చి తక్కువే. ఆయన గతంలో 9ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ఒక్కసారి కూడా స్వామీజీల వివాదంలో ఇరుక్కోలేదు. పెద్దగా స్వామీజీలను దర్శించుకున్నదీ లేదు. కానీ పదేళ్ల విరామం తర్వాత సీఎం అయిన చంద్రబాబులో ఇప్పుడు కాస్త మార్పు కనిపిస్తోంది. అంతకుముందు ముహూర్తాలపైన కూడా పెద్దగా దృష్టి పెట్టని చంద్రబాబు ఈసారి వాటిపైనా చాలా పట్టుదలగా ఉంటున్నారు. ఇది ఆయనలో జ్యోతిషం, మూహూర్తాలు,విశ్వాసాల పట్ల క్రమంగా పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తాజాగా చంద్రబాబు.. ప్రకాశం జిల్లాలోని శ్రీరామ అవధూత స్వామిని కలవడం ఆసక్తిరేపుతోంది... ఐదేళ్లుగా ఈ స్వామి గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఇంతగా పాపులర్ అయిన స్వామీజీ లేరేమో. చేపూరు వద్ద ఆశ్రమం నిర్వహిస్తున్న ఈయన రాజకీయ నాయకులను బాగా ఆకర్షిస్తున్నారు. ఏటా ధర్మపత్నీవ్రతం అనే దంపతులు నిర్వహించే యాగం నిర్వహిస్తారీయన. దానికి దేశంలోని ప్రముఖ రాజకీయనాయకులు హాజరవడం సాధారణమే.. బీజేపీ నాయకులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు, మురళీమనోహర్ జోషిలే కాకుండా యూపీఏ హయంలోనూ కేంద్రమంత్రులు శ్రీరామఅవధూత స్వామి ఆశ్రమానికి వచ్చేవారు. ఇంకా వస్తున్నారు కూడా. ఈ బాబాకు పేరు ప్రఖ్యాతులు ఎంతగా ఉన్నాయో.. వివాదాలూ అంతే.. రెవెన్యూ భూముల్లో ఆశ్రమం కట్టారని.. అదంతా కబ్జా భూమి అని ఆరోపణలున్నాయి. ఐనా ఆయనపై చర్యలు తీసుకునే సాహసం అధికారులు చేయడం లేదు. పదేళ్ల తర్వాత అధికార పీఠం అందుకున్న చంద్రబాబునాయుడు.. ప్రమాణ స్వీకారనికి ముందే.. ఈయన ఆశీస్సులు తీసుకోవాలని అనుకున్నారట. ప్రయాణానికి అంతా సిద్ధమైందట కూడా. చంద్రబాబు చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారట. ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా.. వివాదాల్లో ఇరుక్కోవడం ఎందుకని కొందరు ఆపారట. అంతే కాదు.. ఇటీవల ఆయన్ను దర్శించుకున్న ఎంతోమంది రాజకీయనాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... కష్టాలు ఎందుకు కొని తెచ్చుకోవాలని.. చంద్రబాబుకు సూచించారట. సీఎం అయిపోయి నెలరోజులు దాటింది కదా.. అని చంద్రబాబు ఈసారి బాబాను కలిసే ప్రయత్నం చేశారు. అవధూత స్వామి కూడా ఈసారి ప్రకాశం జిల్లాలో కాకుండా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో యాగం నిర్వహించారు. దాంతో చంద్రబాబుకు కూడా వెళ్లడం ఈజీ అయ్యింది. ఒక్క చంద్రబాబే కాదు.. ఉపముఖ్యమంత్రి చినరాజప్పతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు కూడా ఈ బాబా ఆశీస్సులు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: