మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో చివరకు తెలంగాణ సీఎం కేసీఆర్ దే పైచేయి అయ్యింది. అబ్బే మా నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు లేవని చెప్పుకొచ్చిన నాగార్జున.. తాజాగా స్వయంగా తన నిర్మాణంలోని కొంత భాగం కూల్చేందుకు సిద్దమయ్యారు. ఈ విషయంలో కేసీఆర్ తొలుత విమర్శలు ఎదుర్కొన్నా.. చివరకు ఆయనే పైచేయి సాధించారు. నాగార్జున ఉదంతంలో సక్సస్ కావడంతో ఇక కేసీఆర్ మిగిలిన సినీపెద్దల భూముల బాగోతాలనూ తవ్వి తీసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ భూముల్లో తిష్టవేసి ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమౌతున్నది. ఆంధ్రప్రదేశ్ లో.. ఇన్నాళ్లూ.. రాజకీయం సినిమా పడుగుపేకల్లా కలసిపోయాయి. సినీపెద్దలకు ప్రభుత్వాలు పెద్దపీట వేసి.. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రాజధానిలోకి భూములు చౌక ధరలకే కట్టబెట్టాయి. వాటిలో కొన్ని భూములు దుర్వినియోగం అవుతున్నాయని.. మరికొన్నిచోట్ల.. ఆ భూములను ఆనుకుని ఉన్న భూములు కబ్జా చేశారని విమర్శలున్నాయి. హైదరాబాద్‌ నానక్‌ రామ్‌ గూడ రామానాయుడు స్టూడియో పరిసరాల్లోని చెరువును సైతం కబ్జా చేస్తున్నారన్న వాదన బలంగా ఉంది. స్టూడియో వెలుపల చెరువును ఇటీవలి కాలంలో మట్టితో కప్పి వేశారని ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. నగరంలో ఉన్న చెరువులు, కుంటలు సహా ప్రభుత్వ భూముల్ని కాపాడాలన్న నిబంధన ప్రకారం కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటికే నానక్‌రామ్‌గూడ పరిసరాల్లోని ఆక్రమమణలపైనా దృష్టి సారించిందని తెలుస్తోంది. మరో టాలీవుడ్‌ బిగ్‌షాట్‌ మా అసోసియేషన్‌ అధ్యక్షుడు మురళీ మోహన్‌ భూములపైనా కేసీఆర్ దృష్టిసారించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈయన కేసీఆర్ శత్రువు చంద్రబాబు ఆప్తమిత్రుడు.. ఆ పార్టీ ఎంపీ కూడా. శత్రువు మిత్రుడు శత్రువు అన్న సూత్రం ప్రకారం మురళీ మోహన్ భూములపైనా అధికారులు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో మురళీ మోహన్ చాలా యాక్టివ్ గా రియల్ ఎస్టేట్ నడిపించారు. మాదాపూర్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొన్నారు. ఇప్పుడు ఆ మురళీ మోహన్ భూముల్లో అన్యాక్రాంతం చేసినవేవైనా ఉంటే పరిశీలించాలన్న కోణంలో కూడా కేసీఆర్‌ ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: