స్థానిక ఎన్నికల విషయంలో అధికార పార్టీ ఆగడాలు చాలా మామూలు వ్యవహారాలే. గతంలో వైఎస్సార్ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష పార్టీ తరపున గెలిచిన వాళ్లను తమవైపుకు తిప్పుకొని , కొన్ని జడ్పీ స్థానాలను గెలిపించుకొంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంలో శ్రుతి మించింది. రాష్ట్రంలోని ఏ ఒక్క మున్సిపాలిటీని, ఏ ఒక్క జడ్పీ చైర్మన్ పదవిని, ఎంపీటీసీ అధ్యక్ష పదవిని వదులుకోకూడదు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రలోభాలను మొదలు పెట్టింది. సంతలో పశువుల్లా అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు కూడా సహకరించడంతో తెలుగుదేశం పని సులువు అయ్యింది. అయితే వాళ్లు సహకరించని చోట తెలుగుదేశం పార్టీ కూడా చాలా అతి చేసింది. కిడ్నాప్ ల వరకూ వెళ్లింది. మరి ఇలాంటి తతంగంలోకూ వైకాపా తన ఉనికిని కాపాడుకోగలిగింది. తను గెలిచిన మున్సిపాలిటీలను, ఎంపీపీలను కూడా తెలుగుదేశానికి వదులుకోవాల్సిన వచ్చినప్పటికీ.. అక్కడక్కడ మాత్రం వైకాపా మెరిసింది. అధికార పార్టీ ధాటిని తట్టుకొని నిలబడింది. మరి ఆ సంగతి అలా ఉంటే.. ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు అక్కడక్కడ అదృష్టం కూడా అండగా నిలబడింది. లాటరీ దగ్గర వైకాపా విజేతగా నిలిచింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో వాస్తవంగా వైకాపాకు 18 వార్డులు, తెలుగుదేశం పార్టీకి రెండు వార్డులు దక్కాయి. అయితే తెలుగుదేశం వాళ్లు వైకాపా వార్డు మెంబర్లను తమవైపుకు తిప్పుకొన్నారు. ఏకంగా ఎనిమిది మంది వార్డు మెంబర్లను తెలుగుదేశం తనవైపుకు తిప్పుకొంది. దీంతో బలాబలాలు సమానమయ్యాయి.దీంతో ఎన్నిక లాటరీకి దారి తీసింది. ఆ లాటరీలో వైకాపాకు అదృష్టం కలిసొచ్చింది. ఆమున్సిపాలిటీ వైకాపా సొంతం అయ్యింది. తాజాగా అదే జిల్లాలో జమ్మలమడుగు మున్సిపాలిటీలో కూడా అలాగే జరగడం విశేషం. ఇక్కడ మెజారిటీ వార్డులను వైకాపా గెలచుకొంది. వార్డు మెంబర్లను టీడీపీ తనవైపు తిప్పుకొంది. దీంతో బలాబలాలు సమానం అయ్యాయి. ఇటువంటి సమయంలో లాటరీ తీయగా... మళ్లీ విజయం వైకాపానే వరించింది. ఈ విధంగా వాస్తవంగా తన బలంతో సాధించుకోవాల్సిన సీట్లే అయినా.. అదృష్టవశాత్తూ వాటిని దక్కించుకొని మురిసిపోతోంది జగన్ పార్టీ!

మరింత సమాచారం తెలుసుకోండి: