పోలవరం బిల్లుకు ఎట్టకేలకు ఆమోదముద్ర పడింది. లోక్ సభ, రాజ్యసభ రెండింటి ఆమోదం పొంది రాష్టపతి స్టాంపు కోసం వెయిట్ చేస్తోంది. అది ఎలాగూ లాంఛనప్రాయమే. ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందే నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్- టీఆర్ఎస్ -బీజేపీల మధ్య మాటలయుద్ధం జోరుగా సాగుతోంది. బిల్లు విషయంలో తెలంగాణ సర్కారును సంప్రదించనేలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జైపాల్ రెడ్డి కూడా తీవ్రంగానే స్పందించారు. మోడీ సర్కారు రాజ్యాంగబద్దంగా వ్యవహరించలేదని మండిపడ్డారు. ఈ విమర్శలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తిప్పి కొట్టారు. విమర్శలు చేసినవారిపై ఘాటుగా స్పందించారు. ఒక్కొక్కరి తీరును ఎండగడుతూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ముందుగా ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకున్నారు. రాజ్యాంగ బద్దం కాదంటున్న జైపాల్ రెడ్డి.. ఆనాడు యూపీఏ క్యాబినెట్ మీటింగ్ లో ఉండి.. ముసాయిదా బిల్లుకు ఎలా ఆమోదం తెలిపారని నిలదీశారు. కేబినెట్ మంత్రి హోదాలో ఉండి ఏంచేశారని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు లోక్ సభలో చర్చకు వచ్చినప్పుడు కూడా జైపాల్ రెడ్డి దీనిపై ఎందుకు ప్రశ్నించలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. పొన్నాలపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టిన కిషన్ రెడ్డి.. ముందు తమ పార్టీ విధానమేంటో తెలుసుకోవాలని సూచించారు. ఓ వైపు సాక్షాత్తూ ఆ పార్టీ నేత జైరామ్ రమేశ్ పోలవరం బిల్లు అత్యంత అవసరమని చెబుతుంటూ... దానికి భిన్నంగా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు ఎలా మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. ముందు తమ పార్టీ నేతలను ప్రశ్నించడం నేర్చుకుంటే మంచిదని సలహా ఇచ్చారు కిషన్ రెడ్డి.. కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉన్న కిషన్ రెడ్డి.. కేసీఆర్ తీరుపైనా విమర్శలు గుప్పించారు. పోలవరం పై ఇప్పుడు హడావిడి చేస్తున్న కేసీఆర్ తెలంగాణ బిల్లు వచ్చే సమయంలో పార్లమెంటులో ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అంతేకాదు.. బిల్లు రూపొందించిన సోనియా కుటుంబాన్ని సకుటుంబ సమేతంగా కలసిన కేసీఆర్.. ఎందుకు ఆమెను నిలదీయలేదని ప్రశ్నించారు. కనీసం కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. మోడీ సర్కారుకు లేఖ రాసిన కేసీఆర్.. అందులో పోలవరం అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని కూడా కిషన్ రెడ్డి అడిగారు. అంతేకాదు.. పోలవరం అంశంపై ఓవైపు ఆంధ్రా సీఎం హడావిడి చేస్తుంటే.. కేసీఆర్ కనీసం అఖిలపక్షనేతలను ఎందుకు ఢిల్లీ తీసుకెళ్లలేదని నిలదీశారు. కిషన్ రెడ్డి ప్రశ్నలకు కేసీఆర్, జైపాల్ రెడ్డి, పొన్నాల ఏం సమాధానం చెబుతారో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: