బంగారు రుణాల మాఫీ గురించి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... వెల్లడించిన ట్విస్ట్ భలే ఆసక్తికరంగా ఉంది. ఒక రోజేమో రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తూ.. మరో రోజేమో.. ఏదో ఒక షరతును వెలుగులోకి తీసుకొస్తూ ప్రజల గుండెల్లో రాయి వేస్తున్న తెలుగుదేశం వాళ్లు ఇప్పుడు కొత్త షరతును పెట్టారు. స్వయంగా చంద్రబాబు నాయుడు ఆ షరతును వివరించాడు. ఇంతకీ ఇప్పుడు మేటరేంటంటే... బంగారు రుణాల మాఫీకి అర్హులు కావాలంటే, బంగారు తనఖా పెట్టి తెచ్చుకొన్న డబ్బును వ్యవసాయ పనుల మీదే ఖర్చు పెట్టినట్టు నిరూపించుకోవాలట! అంటే... ఇంట్లోని బంగారాన్ని ఎప్పుడు తనఖా పెట్టారు.. దాన్ని వ్యవసాయపు పనులకు ఏ విధంగా ఉపయోగించారు? అంటే... విత్తానాలు కొన్నారా, లేక కూలీలు చెల్లించారా, లేక సేద్యం చేయించారా, కోత కోశారా.. కుప్పలూర్చారా... అనే విషయాల గురించి స్ఫష్టత ఉండాలట. అప్పుడే బంగారు రుణాలు మాఫీ అవుతాయట. బంగారాన్ని రకరకాల అవసరాల కోసం బ్యాంకుల్లో పెట్టి డబ్బు తెచ్చుకొంటారని అందుకే ఈ షరతులను పెడుతున్నట్టుగా తెలుగుదేశం వాళ్లు చెబుతున్నారు. అదీ నిజమే.. బంగారాన్ని సవాలక్ష కారణాలతో కుదువ పెట్టి వస్తుంటారు. అయితే.. అది టీడీపీవాళ్లకు ఎన్నికల ముందు తెలియదా? అప్పుడేమో.. తనఖాలో ఉన్న మీ బంగారాన్ని అంతా విడిపిస్తాము.. అని ప్రచారం చేసి, ఆడవాళ్లకు ఆశలు పెట్టి.. ఓట్లు వేయించుకొని, ఇప్పుడు షరతులు పెడుతూ వాళ్లను నిరాశపరుస్తున్నారు. ఇప్పటికే కుటుంబంలో ఒకరి కే రుణమాఫీ, మాఫీ కాదు రీషెడ్యూలే.. అంటూ షరతులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు... రైతులు బంగారంపై తెచ్చుకొన్న డబ్బును ఎలా ఉపయోగించారనే విషయాన్ని కూడా చెప్పాలంటూ శీల పరీక్ష పెడుతోంది. మరి దీనిపై జనస్పందన ఎలా ఉంటుందో! మాఫీలపై ఆశలు పెట్టుకొని ఓటేసిన వాళ్లు ఏమనుకొంటున్నారో!

మరింత సమాచారం తెలుసుకోండి: