కొంతకాలంగా హైదరాబాద్ లో భవనాల కూల్చివేతలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని కట్టడాలతో మొదలైన ఈ కూల్చివేతల పర్వం.. ఆ తర్వాత నగరంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఈ కూల్చివేతలు రాజకీయంగా దుమారం రేపినా కేసీఆర్ సర్కారు మాత్రం పట్టువీడటం లేదు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ వంటి వారు తెదేపా ఎమ్మెల్యేలపై కక్షసాధింపుగానే ఈ చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. మరికొందరు సీమాంధ్ర నేతలు కూడా హైదరాబాద్ కూల్చివేతలపై మండిపడ్డారు. ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. మాదాపూర్ నుంచి ప్రారంభమైన ఈ కూల్చివేతలు.. కూకట్ పల్లి, పటాన్ చెరు, మియాపూర్, చర్లపల్లి, సరూర్‌నగర్, ఎల్‌బీనగర్, ఆజంపురా, బడాబజార్, జాస్మిన్‌నగర్, రాంనగర్లకూ విస్తరించాయి. మధురానగర్, బంజారాహిల్స్, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, గాజులరామారం, అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని భవనాలనూ నేలమట్టం చేశారు. తాజాగా... ఈ కూల్చివేతలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటం వల్ల.. కార్పొరేటర్లు క్రమంగా గళం విప్పుతున్నారు. అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోకుండా.. ఏళ్ల తర్వాత కూల్చివేతలకు దిగడాన్ని తప్పుబడుతున్నారు. జీహెచ్ఎంసీ మీటింగ్ లో పలువురు కార్పొరేటర్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్టాండింగ్ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మేయర్ మాజిద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు కూల్చివేతలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కూల్చివేతకు ముందు.. అక్రమ నిర్మాణాలు ఆదిలోనే అడ్డుకోకుండా ప్రోత్సహించిన సంబంధిత సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ల పై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు కూల్చివేతలకు ప్రత్యామ్నాయంగా ఓ ప్రతిపాదన చేస్తున్నారు. లక్షలు ఖర్చు చేసి కట్టిన భవంతులను కూల్చకుండా.. క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. భారీ అక్రమాలు ఉన్న భవనాలను కూల్చినా.. చిన్నపాటి అక్రమాలను కొండ ఫీజు వసూలు చేసి.. అనుమతులు జారీ చేయడమే బెటరని సూచిస్తున్నారు. దీని వల్ల సర్కారుకు పెద్దఎత్తున ఆదాయం సమకూరడమే కాకుండా ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు తప్పించుకోవచ్చని చెబుతున్నారు. మరి వీరి ఒత్తిడి ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: