చంద్రబాబు నాయుడుకు కోపం వచ్చింది. అంతా ఇంతా కాదు. ఆ ఆగ్రహం కాస్తా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ రప్పించేంత వరకూ. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబును ఓ రైతు కరెంట్ సమస్యను ప్రస్తావించినందుకు సీఎం అసహనానికి గురయ్యారు. కథలు చెప్పవద్దని ఆ రైతును గద్దించారు. పైపెచ్చు నేను తలచుకుంటే హైదరాబాద్ కు రప్పించి నీకు ఫైన్ వేస్తానంటూ బాబు హుంకరించారు. నరసన్నపాలెంలో రైతులతో జరిగిన ముఖాముఖిలో చంద్రబాబును..గంగరాజు అనే రైతు కరెంటు సమస్యను ప్రస్తావించాడు. కరెంటు ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని వాపోయాడు. దానికి సీఎం స్పందిస్తూ 'కాంగ్రెస్ హయాంలో దారుణంగా ఉండేది. నేను వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది' అని సెలవిచ్చారు. అయితే దీనికి గంగరాజు బదులిస్తూ...'గవర్నర్ పాలనలోనే నాలుగు గంటలు కరెంట్ వచ్చేది. మీరు వచ్చిన తర్వాత రోజుకు రెండు గంటలే ఉంటోంది' అన్నాడు. దాంతో బాబు మండిపడుతూ 'ఏం మాట్లాడుతున్నావ్. కథలు చెప్పొద్దు' అని గదమాయించారు. సార్ నేను చెబుతోంది నిజమే అని ఆ రైతు అనటంతో బాబుకు బీపీ అమాంతరం పెరిగిపోయింది. 'ఏయ్ నువ్ ఊరికే అరవొద్దు. నేను ట్రాన్స్ కో అధికారులతో మాట్లాడతా. ఏదో చెప్పాలనుకుని చెబితే ఊరుకోను. నీకు సమస్యలు వస్తాయ్. నీ అడ్రస్ కనుక్కుని హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తా' అని ఒకింత బెదిరింపు ధోరణితో అన్నారు. అయినా అదరని గంగరాజు... రెండు రోజులగా కరెంట్ సరఫరా సరిగా లేదు. మంగళవారం అయితే గంట కూడా రాలేదు అని తెగేసి చెప్పాడు. దాంతో పక్కనున్న రైతులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. దాంతో బాబు... సరే... నాకు పనుంది. నువ్వు అక్కడికి రా. నీ విషయం అక్కడ తేలుస్తా అంటూ వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: