అధికార పీఠం పై కూర్చున్న దగ్గరి నుంచీ హైదరాబాద్ లో అక్రమ భూదందాలు, నిరుపయోగ భూమల పై కొరడా ఝళిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కేటాయించినా ఉపయోగించుకోవడం లేదంటూ ఇప్పటికే ఏపీఎన్జీఓలు, చలనచిత్ర అభివృద్ధి సంస్థకూ చెందిన భూములను తమ ఖాతాలో జమ చేసుకుంది. ఇప్పుడు తాజాగా సినిమా రంగానికి చెందిన అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోల భూముల పై ప్రభుత్వ కన్ను పడింది. ఇప్పటికే ప్రాథమిక దశ చర్చలు కూడా ముగిశాయి. అయితే ఇక్కడ నిరుపయోగం సూత్రమే కాకుండా... ఉద్దేశిత అవసరాలకు వినియోగించకపోవడం అనే మరో అస్త్రాన్నీ ప్రయోగించనున్నారు. అన్నపూర్ణ స్టూడియో... అక్కినేని నాగార్జునకు చెందిన ఈ సంస్థకు ప్రభుత్వం మొత్తం 22 ఎకరాల స్థలం కేటాయించింది. 1978లో 16 ఎకరాలు ఆ తర్వాత మరో 6 ఎకరాలను అప్పటి ప్రభుత్వాలు అన్నపూర్ణకు బదలాయించాయి. ఇందులోని 6 ఎకరాల స్థలంలో మాత్రమే సినీ నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మిగిలిన 16 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి 1984లోనే ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రయత్నించి కోర్టు తీర్పుతో వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఇందులోని కొంత భూమిని రిలయన్స్ సంస్థ లీజుకు తీసుకుంది. పద్మాలయ స్టూడియోకు సైతం ప్రభుత్వం అప్పట్లో 9 ఎకరాలు కేటాయించగా... ఇందులో 4 ఎకరాలు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. మిగిలిన 5 ఎకరాలను జీ టెలీ ఫిలిం సంస్థకు విక్రయించారు. 2005లో ఈ 5 ఎకరాలనూ వైఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ తర్వాత మళ్లీ పద్మాలయకే అప్పగించింది. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం ఈ రెండు స్టూడియోల ఖాళీ భూములపై కన్నేసింది. ఇప్పటికే దీనిపై సీసీఎల్ఏలో చర్చ కూడా జరిగింది. ఈ రెండు స్టూడియోల విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నందున ఆచితూచి అడుగులు వేయాలని సీసీఎల్ఏ ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఈ మధ్యనే సినీరంగానికి చెందిన కేఎస్ ప్రకాష్, సంగీత దర్శకుడు చక్రవర్తి లకు కేటాయించిన 4200 గజాల భూమిని సైతం వెనక్కి తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం... అతి త్వరలోనే ఈ రెండు స్టూడియోల వ్యవహారంలోనూ మరింత ముందుకు వెళ్లే దిశగా అడుగులు వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: