ఒక్కటీ రెండు కాదు... 32 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది ఆ విమానం. ఆకాశపుటంచుల్లో వెళుతున్న ఆ ఇనుప విహంగాన్ని కూల్చడమంటే మాటలు కాదు... అత్యాధునిక క్షిపణులు కావాలని చెప్తున్నాయి నిపుణుల విశ్లేషణలు. మరి మలేషియా విమానంను కుప్పకూల్చింది ఉక్రెయిన్ తిరుగుబాటు దారులేనంటే నమ్మగలమా...? వారి దగ్గర అంతటి అత్యాధునిక యుద్ధ పరికరాలు ఉండే అవకాశం ఉందా...? లేకుంటే ఈ దుశ్చర్యకు రష్యా సైన్యమే కారణమా...? కాదంటే ఉక్రెయిన్ బలగానే విమానాన్ని నేలకు కూల్చాయా...? విశ్లేషించి చూస్తే ఎన్నో అనుమానాలు తాండవిస్తున్నాయక్కడ. ఉక్రెయిన్... రష్యా అనుకూల తిరుగుబాటు దారుల దాడులతో దద్దరిల్లుతున్న దేశం. ప్రస్తుతం ఇక్కడ అడుగడుగునా రష్యా అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మరో ప్రపంచ యుద్ధమే నడుస్తోంది. తరచూ ఉక్రెయిన్ సైనిక విమానాలు సైతం క్షిపణుల దాడితో నేల కూలుతున్నాయి. తమ దేశంలోని తిరుగుబాటు దారులకు ఈ క్షిపణులను రష్యా ప్రభుత్వమే సరఫరా చేస్తోందని ఉక్రెయిన్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మలేషియా విమానం కుప్పకూలింది. 295 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అయితే ఈ ఘటన సరిగ్గా ఉక్రెయిన్ - రష్యా సరిహద్దుల్లో జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అల్లంత ఎత్తున ఎగురుతున్న విమానాన్ని కూల్చే సామర్థ్యం ఉక్రెయిన్ తిరుగుబాటుదారులకు సొంతంగా ఉండదు. అంటే రష్యా సహకారంతోనే ఈ పనికి ఆ వర్గం పాల్పడిందా...? లేదంటే ఉక్రెయిన్ ను హెచ్చరించడానికి రష్యా సైన్యమే నేరుగా ఈ దురాఘతానికి ఒడిగట్టిందా...? అన్న ఆలోచనలూ తాండవిస్తున్నాయి. మరోవైపు ఆలోచిస్తే... ఉక్రెయిన్ లోని రష్యా వ్యతిరేక వర్గాలకు ఉక్రెయిన్ ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ వర్గమే ప్రభుత్వ సహకారంతో విమానాన్ని కూల్చి రష్యా అనుకూల వర్గానికి హెచ్చరికలు పంపిందా...? లేకుంటే ఉక్రెయిన్ సైన్యమే నేరుగా విమానాన్ని పడగొట్టి ప్రపంచం దృష్టికి సమస్యను తీసుకురావాలని చూసిందా...? ఇరు దేశాల సరిహద్దుల్లో జరిగిన ఈ సంఘటనలో నిజా నిజాలు ఏమిటన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇప్పటికే ఈ అంశంపై మలేషియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విమానం ఉక్రెయిన్ గగన తలంలోకి వెళ్లిన తర్వాతే రాడార్ తో సంబంధాలు తెగిపోయాయని మలేషియా వెల్లడించింది. కానీ సంఘటన జరిగింది మాత్రం సరిగ్గా సరిహద్దుల్లోనే కావడంతో క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే నాలుగు నెల్ల క్రితం 370 మంది ప్రయాణీకులతో అదృశ్యమైన ఓ మలేషియా విమానం కథ ఇంకనూ కంచికి చేరలేదు. ఇప్పుడు కళ్ల ముందే కుప్పకూలిన ఈ విమానం వెనుక ఎవరు ఉన్నారనేది ఎప్పుడు తేలుతుందో... మొత్తానికి ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనే సామెత కుప్ప కూలిన మలేషియా విమానానికి సరిగ్గా సూటవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: