ఒకేసారి అధికార పీఠం ఎక్కిన నేరానికి ఏపీ, టీసీ ప్రభుత్వాధినేతలకు పోలిక ఇబ్బంది తప్పదేమో.. అందులోనూ రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వైఖరి నెలకొన్న పరిస్థితుల్లో ఎవరేం చేసినా..మరొకరు అది చేశారా లేదా అని చీటికీమాటికీ పోల్చి చూసుకుంటూనే ఉంటారు. ఎవరు ఏ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకున్నారనే విశ్లేషణ కంటే.. ఎవరేం చేశారనేది ముఖ్యంగా మారిపోతుంది జనాలకు. ఈ విషయంలో కేసీఆర్, చంద్రబాబుల పాలనను బేరీజు వేసి చూస్తే.. నెలన్నర రోజుల పాలన తర్వాత చంద్రబాబు కంటే కేసీఆరే దూసుకుపోతున్నారన్న అభిప్రాయానికి రాక తప్పదు. కట్టడాల కూల్చివేతలు, ఫీజు రీఎంబర్స్ మెంట్ వివాదాలను పక్కకుబెడితే... ఎన్నికల హామీలను నెరవేర్చడంలో.. వాటి పట్ల ఓ స్పష్ట ఉండటంలో కేసీఆర్ ముందున్నారు. మొన్న ఆయన కేబినెట్ తీసుకున్న నిర్ణయాల పట్ల... తెలంగాణ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోనే నా భగవద్గీత అంటూ ప్రకటిస్తున్న తెలంగాణ సీఎం.. వాటిలో చాలావరకూ సాకారమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతే కాదు.. ఇచ్చిన హామీలేంటి... వాటిలో ఎన్ని నెరవేర్చగలం.. దేనికి ఎంత ఖర్చవుతుందన్న క్లారిటీ కేసీఆర్ కు ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాలి. ఒకటి కాదు.. రెండు.. కాదు.. దాదాపు 43 అంశాల్లో ఆయన వెలువరించిన నిర్ణయాలు.. సాహసోపేతమైనని చెప్పక తప్పదు. కేసీఆర్ తో పోలిస్తే... చంద్రబాబు ప్రభుత్వ పనితీరులో అంత దూకుడు కనిపించడం లేదు. లోటు బడ్జెట్, విభజన సమస్యలు ఉన్నా.. జనం వాటిని అంతగా అర్థం చేసుకుంటారా అన్నది సందేహాస్పదమే. ఎంతసేపు మన దగ్గర డబ్బులేదు.. మన దగ్గర అన్నీ సమస్యలే అంటూ కూర్చుంటే.. జనం కూడా ఎక్కువ కాలం వినలేరు. అవన్నీ తీరుస్తావనే కదా నిన్ను ఎన్నుకున్నది అంటారు. రుణ మాఫీ అంశం చంద్రబాబును ఎటూ కదలనీయకుండా చేస్తూ పెద్ద గుదిబండలా తయారైంది. కేసీఆర్ స్పష్టంగా ఎన్నికల ముందే.. లక్షలోపు రుణాలు అని ప్రకటించి బతికిపోయారు. తెలంగాణలో రుణాలు తీసుకునే రైతులు తక్కువ. అందువల్ల కేసీఆర్ పై ఆ భారం తక్కువగానే ఉంది. అందులోనూ కేసీఆర్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ తో ఉంది. అలాగని చంద్రబాబు ఏమీ చేయలేదని చెప్పలేం. ఆయన కూడా ఫించన్లు సెప్టెంబర్ నుంచి పెంచుతున్నారు. అక్టోబర్ 2 నుంచి నిరంతర విద్యుత్ ఇవ్వబోతున్నారు. మొత్తానికి కారు జోరుగా దూసుకుపోతుంటే... సైకిల్ స్పీడు మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: