అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి.. ముచ్చటగా మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఏపీ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలపై అప్పుడే పొలిటికల్ కౌంటర్లు మొదలయ్యాయి. ఎన్నికల హామీలు అమలు చేయలేక మల్లగుల్లాలు పడుతున్న చంద్రబాబుపై ప్రతిపక్షనేత వై.ఎస్. జగన్ విమర్శల వర్షం కురిపించారు. రాజకీయాల్లో ఆ మాత్రం విమర్శలు ఉంటూనే ఉంటాయి. ఐతే.. జగన్ విమర్శలు మళ్లీ ఎన్నికల దిశగా సాగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో దారుణమైన పరిపాలన సాగిస్తున్నారని జగన్ మండిపడ్డారు. సాధారణంగా ఏ సీఎంకైనా ప్రజావ్యతిరేకత ఏర్పడటానికి రెండేళ్లు పడుతుందని.. బాబు ప్రభుత్వం ఏర్పడి నెల గడవకముందే ప్రజలంతా ఆయన ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గ్రాఫ్ అంత దారుణంగా పడిపోయిందన్న జగన్.. ఈ రోజు తిరిగి ఎన్నికలు పెట్టండి.. వైఎస్సార్‌సీపీ 167 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందని చంద్రబాబుకు సవాల్ విసిరారు. రుణమాఫీపై మాయమాటలు చెబుతున్న చంద్రబాబు చివరికి నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపైనా యూ టర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన పెద్దమనిషి, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని తానెప్పుడూ చెప్పలేదంటున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనంగా మారిన జగన్ కు ఆది నుంచీ పదవులు, సీట్లపైనే ధ్యాస ఉందన్న చెడ్డపేరు మూటగట్టుకున్నాడు. సోనియాను పల్లెత్తు మాటనడానికే గజగజా వణికిపోయే కాంగ్రెస్ నేతలకు భిన్నంగా.. ఏకంగా అధినేత్రినే సవాల్ చేస్తూ సంచలనంగా నిలిచాడు. తండ్రి మరణం, ఒంటరిపోరు.. ఓదార్పు యాత్ర.. ఇలాంటి సెంటిమెంట్ ఇష్యూల కారణంగా జగన్ కు విపరీతమైన పాపులారిటీ వచ్చినా.. అబ్బో ఈ కుర్రాడికి పదవీకాంక్ష చాలా ఎక్కువన్న చెడ్డపేరు కూడా మూటగట్టుకున్నాడు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడమంటే ఎప్పుడూ.. ఎన్నికలగురించే ఆలోచించడం కాదని.. ఐదేళ్లు ఓపిగ్గా ప్రతిపక్షపాత్ర నిర్వహిస్తేనే.. అధికారదండం అందుతుందని జగన్ తెలుసుకుంటే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: