ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం రెండు రోజుల శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. కొత్త స్పీకర్ కోడెల ఈ శిక్షణ ఏర్పాటు చేస్తామని ముందుగానే అసెంబ్లీలోనే ప్రకటించారు. ఆ తర్వాత షెడ్యూలు కూడా ముందుగానే సభ్యులకు చెప్పేశారు. వీరి కోసం చాలా ఖర్చు చేసి.. హైదరాబాద్ లోని ఐటీసీ కత్రియాలో అనువజ్ఞుల చేత క్లాసులు ఇప్పిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మాజీ కాగ్ వినోద్ రాయ్ వంటి దిగ్గజాలు హాజరై.. తమ అనుభవాల సారాంశాన్ని, రాజకీయ సూత్రాలను వివరించారు. సభాపతి కోడెల, మండలి ఛైర్మన్ చక్రపాణి, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ వంటి వారు కూడా హాజరయ్యారు. మొత్తం ఏపీ శాసనసభలో 175మంది ఎమ్మెల్యేలుంటే.. ఈ శిక్షణ కార్యక్రమాలుకు 125 మంది మాత్రమే హాజరయ్యారు. సీనియర్ సభ్యులంటే సరేలే.. మనం కొత్తగా తెలుసుకునేదేముందని కాస్త నిర్లక్యం వహించారేమో గానీ.. కొత్త సభ్యుడు.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ మాత్రం హాజరు కాలేదు. మాట్లాడితే వంశం పేరు చెప్పే బాలయ్య.. కొమ్ములు తిరిగిన వంశస్తులం మనకు ట్రైనింగేంటి అనుకున్నారో..ఏమో.. లేకపోతే.. మనం చెబితే ఒకడు వినాలి కానీ.. ఒకడు చెబితే మనం వినేదేంటి అనుకున్నారో.. మొత్తానికి ట్రైనింగ్ కు డుమ్మా కొట్టారు. బాలయ్య డుమ్మాకు అసలు కారణం ఏంటంటే.. ఆయన కొత్త సినిమా షూటింగేనట. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరుగుతోందట. అందుకనే రాలేదట. బాలయ్యలాగానే కొత్తగా అసెంబ్లీ ముఖం చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షడు జగన్ కూడా ఈ క్లాసులకు హాజరు కాలేదు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పెద్దమొత్తంలో వచ్చినా.. తొలిరోజు మాత్రం జగన్ శిక్షణాకార్యక్రమాల్లో కనిపించలేదు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉండిపోవడమే ఇందుకు కారణం కావచ్చు. ఏదేమైనా.. అనుభవజ్ఞుల అమూల్యమైన సలహాలు, సూచనలు, జ్ఞాపకాలు తెలుసుకునే అవకాశం వీరిద్దరూ మిస్ చేసుకోవడం అంతమంచిది కాదేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: