ఉక్రెయిన్... 5 కోట్ల 17 లక్షల మంది జనాభా కలిగిన ఓ చిన్న దేశం. 2 లక్షల 33 వేల చదరపు మైళ్లు దీని విస్తీర్ణం. జనాభా, విస్తీర్ణం పరంగా చిన్నదే అయినా ఐరోపా ఖండపు దేశాల్లో రెండో అతిపెద్ద దేశం ఇది. 1922లో సోవియట్ యూనియన్ లో చేరింది ఉక్రెయిన్. అయితే 1991లో యూనియన్ పతనం తర్వాత స్వతంత్ర దేశంగా అవతరించింది. కీవ్ పట్టణాన్ని రాజధానిగా కలిగి ఉన్న ఈ దేశంలో సారవంతమైన భూములతోపాటు భారీ పరిశ్రమలు సైతం అనేకం ఉన్నాయి. అంతా భాగానే ఉన్నా ఆర్థికంగా మాత్రం ఎప్పుడూ ఈ దేశం ఇతరుల సాయం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. రష్యాకు సమీపంలో ఉండి, ఎక్కువ సరిహద్దును కలిగి ఉండడం కూడా ఉక్రెయిన్ తీరని శాపంగా మారింది. ఉక్రెయిన్ లో ఎక్కువగా ఉక్రేనియన్లే ఉన్నప్పటికీ రష్యన్లు కూడా కొంతమేర ఉన్నారు. చాలా మంది ఉక్రెయిన్ భాషనే మాట్లాడతారు. కొందరు రష్యన్ భాషను ఉపయోగిస్తారు. ఉక్రెయిన్ తూర్పు భాగంలో రష్యన్ల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచే ప్రాంతీయతత్వం ఎగిసిపడింది. స్వాతంత్రం సిద్ధించిన నాటి నుంచీ ఈ దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య ఎన్నడూ సఖ్యత లేదు. ఇటు రష్యాతోపాటు అటు యూరోపియన్ యూనియన్ తోనూ సత్సంబంధాలు సాగించడానికి తమ దేశం సాగిస్తున్న ప్రయత్నాలకు గండిపెట్టి, దేశంలో ఆరని మంట రగిల్చారు ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం వాసులు ఈయుూలో కలవడానికి ఆసక్తి చూపుతున్నారు. కాగా తూర్పు ప్రాంత వాసులు మాత్రం రష్యాకు అనుకూలంగా మెలుగుతున్నారు. ఇక్కడే వివాదం రాజుకుంది. గతేడాది నవంబరులో యూరోపియన్ యూనియన్ తో ఉక్రెయిన్ కు ఉన్న ఒప్పందాన్ని తిరస్కరిస్తూ రష్యాకు అనుకూలంగా అధ్యక్షుడు విక్టర్ తీసుకున్న నిర్ణయం దేశంలో రచ్చను రాజేసింది. దీనిపై ఆగ్రహించిన ఉక్రెయిన్ పార్లమెంట్ విక్టర్ ను పక్కకు జరిపి పెట్రో పొరొషెంకోను అధ్యక్షుడిగా నియమించింది. దీంతో దేశంలోని రష్యా అనుకూల వర్గం ఆందోళనలకు తెర తీసింది. ఉక్రెయిన్ లో ప్రాబల్యం కోసం చూస్తున్న రష్యా ఇక్కడి తిరుగుబాటుదారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే తమ ఆధిపత్యం ఎక్కువగా ఉక్రెయిన్ ద్వీపకల్పం క్రిమియాలో రష్యా బలగాలు తిష్ట వేశాయి. దీనికితోడు పోయిన ఫిబ్రవరీ ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటు దారులు దేశ రాజధాని కీవ్ లోనూ విధ్వంసానికి పాల్పడ్డారు. ఇప్పుడు కూడా కొంత కాలంగా తిరుగుబాటుదారులు దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. ఇటీవల తరచూ రష్యా సరిహద్దుల్లో ఈ బలగాలు ఉక్రెయిన్ కు చెందిన పలు సైనిక విమానాలను సైతం నేలకూల్చాయి. తాజాగా మలేషియా విమానం కుప్పకూలి, 295 మంది ప్రాణాలు కోల్పోయింది కూడా ఈ ప్రాంతంలోనే. దీంతో ఈ పని ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల పనే అనే అనుమానం కలిగిస్తోంది. తమ దేశంలోని తిరుగుబాటు దారులకు రష్యా సహకారం అందిస్తోందని ఉక్రెయిన్ ఎప్పటి నుంచో వాపోతోంది. దేశ సరిహద్దుల్లో వాళ్లకు శిక్షణ శిబిరాలు కూడా నిర్వహిస్తోందని పలు సందర్భాల్లో మండిపడింది. గతంలో ఉక్రెయిన్ కు భారీ ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న రష్యా దాన్ని మధ్యలో ఉపసంహరించుకుంది. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్ కు ఈయూ సహకారం తప్పనిసరి అయింది. అయితే ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని చూస్తున్న రష్యా... తమ పక్కనే ఉన్న ఉక్రెయిన్ లో ఈయూలో కలిస్తే తమ ఆర్థిక ఆధిపత్యానికి చెక్ పడుతుందేమోనని అనుమానిస్తోంది. ఈ అనుమానంతోనే ఉక్రెయిన్ లో తిరుగుబాటుదారుల్ని ఎగదోస్తున్నారని పాశ్చాత్య దేశాలు సైతం ఆరోపిస్తున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 12 వేల రష్యా బలగాలు సైతం మోహరించి ఉండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. రష్యా అందిస్తున్న బలమైన ఆయుధాల సాయంతోనే తిరుగుబాటుదారులను విమానాలను కూల్చేస్తున్నారని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. 32 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ వెళ్తున్న మలేషియా విమానాన్ని సైతం అత్యాధునిక క్షిపణుల సాయంతోనే కూల్చి వేశారని తెలుస్తోంది. అయితే తిరుగుబాటు దారులకు అంతటి అత్యాధునిక ఆయుధాలెక్కడివి...? ఉక్రెయిన్ సైనిక విమానంగా అనుమానించి రష్యన్లే పొరబాటున మలేషియాకు చెందిన ఎంహెచ్17 పై దాడి చేశారా...? ఇలాంటి అనుమానాలన్నిటికీ సమాధానం రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: