ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. అధికారపక్షం తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు తూటాలతో దాడులు చేసుకుంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నా ఘాటు పదాలతో విరుచుకుపడుతున్న టీడీపీ నేతలు... అటు జగన్ పైనా మాటల దాడికి పాల్పడుతున్నారు. తనను టీడీపీ నేతలు తీవ్ర పదజాలంతో ఎటాక్ చేస్తుంటే... జగన్ కూడా అంతే స్థాయిలో రిప్లై ఇస్తున్నారు. ప్రతి విమర్శలకు తోడు గాంభీర్యాన్ని కూడా జోడిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ఓ ఆర్థిక ఉగ్రవాదని, అనేక కేసులు ఎదుర్కొంటున్న 420 అని ఏపీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికే మరో ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు కేసీఆర్ ను టెర్రరిస్టుతో పోల్చిన సంగతి తెలిసిందే. తాజాగా జగన్ పై విరుచుకుపడ్డ ఉమ... ఓ 420 అయిన జగన్ మాకు నెలరోజుల గడువివ్వడం ఏమిటని ప్రశ్నించారు. నెలరోజుల్లో రుణమాఫీ చేయకుంటే ప్రభుత్వం మెడలు వంచుతానని చెప్తున్న జగన్... మా ప్రభుత్వం చేసే మేలు చూసి తానే మెడలు వంచుకుంటారని ఉమ ఎద్దేవా చేశారు. టీడీపీ విమర్శలకు స్పందనగానో... లేకుంటే రాజకీయ ప్రక్రియలో భాగమేనో... కానీ వైసీపీ అధినేత జగన్ కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. చిన్న చిన్న నేరాలు చేస్తేనే 420 అంటారనీ... అలాంటిది ప్రజలకు హామీలిచ్చి నెరవేర్చకుండా కోట్లాది మందిని మోసం చేసిన చంద్రబాబును ఏమనాలని శ్రీకాకుళం పర్యటనలో ప్రశ్నించారు. సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేసి బాబు అధికారంలోకి వచ్చారని జగన్ ఆరోపించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే అవిశ్వాస తీర్మానం పెడతామని హెచ్చరించారు. ఏపీలోని ఈ రెండు ప్రధాన పార్టీల మాటల యుద్ధం మున్ముందు ఏ తీరానికి చేరుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: