తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు నడుం బిగించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. త్వరలోనే ముఖ్య నేతలతో తెలంగాణా అడహక్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి.. ప్రజా సమస్యలపై పోరాడే విధంగా వ్యూహ రచన చేస్తున్నారు. కార్యకర్తల్లోనూ పునరుత్తేజం నింపి చురుకుగా పనిచేసే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో ఆశించిన స్థాయిలో టీడీపీకి సీట్లు రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పచ్చ పార్టీకి నిరాశే ఎదురైంది. వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా జెడ్ పీ ఛైర్మన్లను దక్కించుకునే అవకాశం ఉన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ల కారణంగా అవి కూడా చేజారిపోయాయి. రంగారెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ పదవితోనే సరిపపెట్టుకోవాల్సి రావడం కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురి చేసింది. తెలంగాణలో పార్టీ కేడర్ బలంగా ఉన్నా ఫలితాలు తలకిందులు కావడంతో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఏకంగా చంద్రబాబే రంగంలోకి దిగారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ముఖ్య నేతలతో చంద్రబాబు మంతనాలు సాగిస్తున్నారు. త్వరలోనే తెలంగాణా రాష్ట్రంలో అడహక్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పార్టీ పట్ల నిబద్దత, క్రమశిక్షణ, కష్టపడేతత్వం వున్న వారికే కమిటీలో పెద్ద పీట వేయాలని భావిస్తున్నారు. ఆగస్టులో సభ్యత్వ నమోదు ప్రారంభమై అక్టోబర్ లో తెలంగాణా ప్రాంత పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పదేళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి ఏదో ఒక రకంగా వారిని సంతృప్తి పరిచేందుకు బాబు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన వారికి ఢిల్లీ స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో నియమించాలనే యోచనలో ఉన్నారు. టీటీడీ బోర్డులోనూ కొంతమంది తెలంగాణవారిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: