తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ దూసుకెళ్తున్నారా అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఇప్పటికే సంచలన నిర్ణయాలతో దూకుడుగా వెళ్తోన్న సీఎం కేసీఆర్.. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే దళిత, గిరిజన మహిళల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రకటించిన కేసీఆర్… మిగతా వారి కోసం మరి కొన్ని ప్రణాళికలు రెడీ చేస్తున్నారని టాక్. తెలంగాణ లో సరికొత్త పంథాలో దూసుకుపోతున్న ఆయన.. పాలనలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు, వాటితో జనానికి కలిగిన ప్రయోజనాలపై కేసీఆర్ అధ్యయనం చేశారు. ప్రధానంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, బంగారు తల్లి, అమ్మహస్తం, రాజీవ్ యువకిరణాలు, ఆరోగ్యశ్రీ, ఇలా పలు పథకాలు ప్రారంభించి గత సీఎంలు ప్రజల్లోకి వెళ్ళారు. వీటిలో కొన్ని మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ అవేవీ ఉద్యమం ముందు వారిని కాపాడలేకపోయాయి. దీంతో ప్రజలకు అండగా ఉండే పథకాలు రచించే పనిలో పడ్డారు సీఎం కేసీఆర్.  ఇక నుంచి ప్రారంభించే పథకాలన్నీ.. ప్రజలను ఆకర్శించడంతో పాటు.. పాలనపై చెరగని ముద్ర వేసేలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణలో సామాజికంగా వెనుకబడిన వర్గాలు 85 శాతం ఉన్నారు. వారు అభివృద్ది వైపు పయనించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కొత్త పథకాలకు రూపకల్పన చేసి.. అదనపు నిధులు కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు. ఇప్పటికే దళిత,గిరిజన మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, విద్యార్ధులకు ఫ్యాస్ట్ ప్రారంభించిన కేసీఆర్… గ్రామాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం మన ఊరు-మన ప్రణాళికలు, దళితులకు మూడెకరాల భూమి పంపకంతో పాటు.. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలో బీసీలకు కూడా లబ్ది చేకూర్చే పథకానికి రూపకల్పన చేయాలని చెప్పారు. వీటన్నింటికీ నిధుల అటంకం కలగకుండా.. కావాల్సిన జాగ్రత్తలు పాటించాలని సూచించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కేబినేట్ అమోద ముద్ర వేయించుకున్న కేసీఆర్.. రానున్న రోజుల్లో అన్ని వర్గాలకు భరోసా ఇచ్చేందుకు ముందుకు వెళ్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: