తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఓయూ విద్యార్థులు గరం గరంగా ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై శుక్రవారం నుండి ఓయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం పొలిటికల్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. తార్నాక నుండి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. కోదండరాం ఇంటి వద్ద విద్యార్థులను అక్కడనే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు మద్దతివ్వాలని విద్యార్థులు కోదండరాంని కోరారు.  ఈ సందర్భంగా విద్యార్థులు టెన్ టివితో మాట్లాడారు. ఎలాంటి స్వార్థంతో ఆలోచించకుండా నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నష్టపోయామన్నారు. అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అనేక హామీలు గుప్పించారని, కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని తీవ్రంగా విమర్శించారు. పిపిఎస్సీ భర్తీ చేయాలని, లేనిపక్షంలో మరో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. శుక్రవారం చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న మహిళా విద్యార్థినిల పట్ల పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించి లాఠీఛార్జీ చేశారని పేర్కొన్నారు. వెంటనే కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: