ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకొంటున్నట్టుగా కనిపిస్తోంది. శాసనసభలో ఆయనకు కేటాయించిన గది ఇందుకు ఒక సాక్ష్యంగా కనిపిస్తోంది. రెండు సంవత్సరాలుగా సీజ్ చేసి ఉంచిన గది ని జగన్ మోహన్ రెడ్డికి యథాతథంగా కేటాయించారు అధికారులు. ప్రతిపక్ష నేత స్థాయికి, ఆయన క్యాబినెట్ హోదాకి తగిన స్థాయిలో కాకుండా... ప్రభుత్వ అధికారులు ఉండటానికి కూడా ఇష్టపడని గదిని జగన్ మోహన్ రెడ్డికి కేటాయించారని సమాచారం. ఈ పరిణామంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ గదిని రెండు సంవత్సరాలుగా ఎవరూ వాడటం లేదని, అసలే చిన్నదని, దానికి తోడు రెండేళ్ల నుంచి ఎలాంటి సంస్కరణ లేకపోవడంతో ఆ గది పరిసరాలు అన్నీ చెత్తాచెదారంతో నిండిపోయాయని, భరించలేని కంపు వస్తోందని... వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. దీన్ని తమ నాయకుడికి కేటాయించినట్టుగా ఉత్తర్వులు అందాయని.. అధికారులు కొద్దిగానైనా ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అదికూడా తమ పార్టీకి ఒకే ఒక గదిని కేటాయించారని, శాసనసభలో ముఖ్యులు అయిన డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ లకు రెండు రెండు గదులున్న వాటిని కార్యాలయాలుగా కేటాయించి... ప్రతిపక్ష నేత అయిన జగన్ మోహన్ రెడ్డికి మాత్రం ఒక గదినే కార్యాలయంగా కేటాయించి.. వైకాపాను మొత్తం ఈ కార్యాలయానికే పరిమితం చేశారని.. 67 మంది ఎమ్మెల్యేలున్న ఒక పార్టీని ట్రీట్ చేసే పద్ధతి ఇది కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. అయితే రాష్ట్ర విభజనతో సరైన అసెంబ్లీ భవనమే లేకుండాపోయిందని, అలాంటప్పుడు అందరూ సర్దుకోవాలని శాసనసభ అధికారులు చెప్పే అవకాశంఉంది. కానీ ఒకవైపు బాబు కార్యాలయాల రిపేరీకి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయ రిపేర్లకు పదుల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత కోసం ఆ రూములను క్లీన్ చేయించి.. కేటాయించలేకపోయారా?! ఇంతకీ అధికారుల ఉద్దేశం ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: