హైదరాబాద్ లో కూల్చివేతలపై మాంచి దూకుడు మీదున్న కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ఎందుకో ఈ మధ్య అంతగా మీడియా ముందుకు రాని కిషన్ రెడ్డి.. 2,3 రోజుల నుంచి రోజూ మీడియా ముందు కొస్తున్నాడు. తెలంగాణ సీఎం ను టార్గెట్ చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. ఫీజు రీఎంబర్స్ మెంట్ వివాదంపై శుక్రవారం గళమెత్తిన కిషన్ రెడ్డి.. శనివారం.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై మాట్లాడారు. కూల్చివేత విషయంలో కేసీఆర్ సర్కారు వైఖరిపై మండిపడ్డారు. కూల్చివేతల విషయంలో ప్రభుత్వం పక్షపాతం చూపిస్తుందన్న కిషన్ రెడ్డి.. పాతబస్తీలోని అక్రమ నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఒవైసీ ఆసుపత్రి నిర్మాణంలోనూ ఎన్నో అవకతవకలున్నాని ఆరోపించారు. వాటిని కూల్చివేసే సత్తా ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. అక్రమాలు ఎవరివైనా ఒక్కటేనని.. కానీ ప్రభుత్వం కొందరిపైనే కక్ష కట్టినట్టు వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముస్లింలకు రిజర్వేషన్ల విషయంపైనా కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇదే కేవలం కేసీఆర్ బుజ్జగింపు చర్య మాత్రమేనన్నకిషన్ రెడ్డి... 12శాతం రిజర్వేషన్ల అంశం కోర్టుల ముందు నిలబడదన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే ప్రయత్నం చేసి విఫలమైన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం లెక్కల ప్రకారమే తెలంగాణలో 40 వేల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నారని... మరి వారికందరికీ కేసీఆర్ అన్యాయం చేస్తారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షపదవి ఉంటుందా... ఊడుతుందా.. అన్న ఆందోళనలో ఉన్నాడేమో.. వరసగా ప్రెస్ మీట్లు పెట్టి కిషన్ రెడ్డి హడావిడి బాగానే చేస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: