ఒక ప్రొఫెసర్ గానేకాక.. ఉద్యమనాయకుడిగా కోదండరామ్ తెలంగాణ ప్రజలకే కాదు.. అటు సీమాంధ్రవాసులకూ సుపరిచితుడే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఈ అధ్యాపకుడి పాత్ర చెప్పకోదగింది. ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ ల తర్వాత తెలంగాణలో ఉద్యమంలో కీలకభూమిక ఈయనదే అని చెప్పొచ్చు. కేసీఆర్ ముందుస్థానంలో ఉండి ఉద్యమం నడిపించినా... ఆయన ఒక్కడితోనే తెలంగాణ సాధ్యం కాలేదని.. జేఏసీ, ప్రజాసంఘాల కృషి తెలంగాణ ఏర్పాటులో తక్కువేమీ కాదని ఉద్యమంపై అవగాహన ఉన్నవారెవరైనా అంగీకరించే వాస్తవం. ఒక దశలో కేసీఆర్ మౌనం వహించినా.. తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరాం.. మూడు, నాలుగు నెలల పాటు ఉద్యమాన్ని ముందుడి నడిపించారు. ఉద్యమం ముగిసింది. తెలంగాణ వచ్చింది. మరి ఇప్పుడు కోదండరాం సార్ ఏం చేస్తున్నారు.. ఆయన మళ్లీ విధుల్లో చేరేందుకు సిద్దమవుతున్నారట.. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ పాఠాలు చెప్పేందుకు రెడీ అవుతున్నారట. ఈ మేరకు ఇప్పటికే ఉస్మానియా యూనివర్శిటీలో రిపోర్టు కూడా చేశారట. మరో రెండు రోజుల్లో సికింద్రాబాద్ పీజీ కళాశాలలో రాజనీతిశాస్త్ర అధ్యాపకునిగా విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఆయన కొలువు వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ ఉందట. 2010లో ఉద్యమం కోసం సెలవు పెట్టిన కోదండరాం.. అప్పుడప్పుడు ఓ ఆరునెలల పాటు పాఠాలు చెబుతూనే ఉద్యమంలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తో ఆయనకు విబేధాలు వచ్చిన మాట వాస్తవమే. అందుకే కేసీఆర్ ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని వార్తలు వచ్చాయి. ఐతే ఈమధ్య అందరితోనూ సఖ్యతగానే ఉంటున్న కేసీఆర్ కోదండరామ్ కు కూడా మంచి పదవి కట్టబెట్టాలని ఆలోచిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్న సమాచారం. తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటయ్యాక.. ఆయన్నే తొలి ఛైర్మన్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. కేసీఆర్ పదవి ఇచ్చినా ఇయ్యకపోయినా తన మానాన తాను పనిచేసుకుపోవాలని కోదండరాం భావిస్తున్నారు. మరి చాలా గ్యాప్ తర్వాత తరగతి గదిలో అడుగుపెట్టే కోదండరామ్.. ఈసారి పిల్లలకు ఏం పాఠాలు చెబుతారో..

మరింత సమాచారం తెలుసుకోండి: