కేసీఆర్ అధికారంలోకి వచ్చాక... మిగతావాళ్ల సంగతేమో కానీ.. ప్రొక్లయినర్లకు, బుల్డోజర్లకూ గిరాకీ పెరిగింది. వీరికి చేతినిండా పని దొరికింది. హైదరాబాద్ లో కూల్చివేతల పర్వం.. ఇప్పుడు ఇళ్ల భవనాల నుంచి పరిశ్రమలకూ పాకింది. కాకపోతే.. ఇళ్ల కూల్చివేతపై నిరసనలు వ్యక్తమైతే.. వీటిపై మాత్రం జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న పరిశ్రమలను అధికారులు తొలగించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం 45 పరిశ్రమల నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. వీటిలో ఎక్కువగా.. ప్లాస్టిక్, స్క్రాప్ తదితర కాలుష్యకారకమైన పరిశ్రమలే ఉన్నాయి. భారీ బందోబస్తు మధ్య వీటిని కూల్చేశారు. వాస్తవానికి ఇది రెసిడెన్షియల్ ఏరియా.. కేవలం ఇళ్లు మాత్రమే ఉండాలి. కానీ.. అనధికారికంగా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి.. వాయు కాలుష్యానికి కారణమవుతున్నారు. గతంలోనూ అధికారులు వీటిపై కొరడా ఝుళిపించినా.. మళ్లీ మళ్లీ పరిశ్రమల అధికారులు వీటిని నెలకొల్పుతున్నారు. పెద్దగా మెషినరీ లేకపోవడం.. వల్ల.. కూల్చివేసిన కొన్ని రోజులకే మళ్లీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ.. కాలుష్యం వెదజల్లుతున్నారు. శనివారం రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలంలో పవర్ హాలీడే కావడం వల్ల అధికారుల కూల్చివేత పని సులభమైంది. కొంత మంది పరిశ్రమల యజమానులు.. 2,3 రోజులు గడువు ఇవ్వాలని కోరినా.. అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికే రెండు, మూడు సార్లు నోటీసులు జారీ చేశామని..ఇంకా ఉపేక్షించేది లేదని ఖరాఖండీగా చెప్పేశారు. కొందరు యజమానులు అడ్డుపడినా.. పోలీసులు సాయంతో వారిని నిలువరించారు. ఇప్పటికే ఇళ్ల మధ్య కాలుష్యం వెదజల్లుతున్న ఈ పరిశ్రమలపై స్థానికులు కూడా పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. కూల్చివేతలతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: