ఎం.ఎస్.ఓలు... ఇప్పుడు సమాజంలో వీరి ఉన్నంత పవర్ ఎవరికీ లేదేమో అనిపిస్తుంది. సాధారణంగా పొలిటికల్ లీడర్లే పవర్ సెంటర్లని అనుకుంటారం. కానీ ఎమ్మెస్వోలు వారిని మించిపోతున్నారు. ప్రముఖ పొలిటికల్ లీడర్లకు కూడా అంతగా భయపడని మీడియా ఎమ్మెస్వోలకు మాత్రం గజగజ వణికిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం టీవీ9, ఏబీఎన్ ఛానళ్ల నిలిపివేతతో ఆ సంగతి మరోసారి రుజువైంది. సాధారణంగా కూడా న్యూస్ ఛానళ్లు ఎమ్మెస్వోల కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. ఎందుకంటే తమ ఛానల్ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్నిచోట్లా ప్రసారాలు రావాలంటే.. అంతా వీరి చేతిలోనే ఉంటుంది కాబట్టి. టీవీ9, ఏబీఎన్ ఛానళ్ల నిలిపివేతతో వార్తల్లోకి వచ్చిన ఎమ్మెస్వోలు... తాజాగా జెమినీ టీవీపైనా యుద్దం చేస్తున్నారు. ఆ ఛానల్ చందా పెంచడమే దీనికి కారణం. చందా పెంపును తగ్గించాలంటూ ఎమ్మెస్వోలు ఆందోళనబాట పట్టారు. ఐతే చందాలు పెంచుకునేందుకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.. ట్రాయ్ ఇప్పటికే అనుమతించింది. పైగా ద్రవ్యోల్బణానికి తగినట్టుగా ఎప్పటికప్పుడు చందాలు పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించింది. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చానల్ యాజమాన్యాలు ధరలపెంపు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ఎమ్ ఎస్ వోలు ట్రాయ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ద్రవ్యోల్బణంతో ముడిపెట్టి పే చానల్ రేట్లు పెంచుకోవటానికి అనుమతించటం మంచిది కాదని డిటిహెచ్ ఆపరేటర్లు కూడా వాదిస్తున్నారు. ఛానళ్లు మాత్రం... కార్యక్రమాల నాణ్యత గత పదేళ్ళలో బాగా పెరిగిందని, పే చానల్స్ చందా మొత్తాలు మాత్రం పెరగలేదని, ఎంతోకాలంగా చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరిందని అంటున్నాయి. పే చానల్ గా మారినప్పుడు నిర్ణయించిన ధరకు, ఇప్పటిధరకు, ఈ మధ్య గడిచిన కాలంతో పోల్చి చూసి మార్కెట్లో అన్ని వస్తువుల, సేవల ధరలతో పోల్చి చూస్తే ఈ పెరుగుదల చాలా తక్కువని వివరణ ఇస్తున్నాయి. ఐతే.. ఎంటర్టన్మెంట్ చానల్స్ మీద ఉద్యమించటం ఎమ్మెస్వోలకు న్యూస్ చానల్స్ ఆపినంత సులభం కాదని గత అనుభవాలు రుజువుచేస్తున్నాయి. న్యూస్ చానల్స్ ఒకటో రెండో ఆపేసినా ప్రేక్షకుల నుంచి పెద్దగా వత్తిడి ఉండకపోవచ్చు. కానీ ఎంటర్టైన్మెంట్ చానల్స్ విషయంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. అలవాటు పడిన సీరియల్స్, గేమ్ షోస్ ఆగిపోతే ప్రేక్షకులు సహించరు. పైగా ఒక చానల్ ప్రసారాలు ఆపేస్తే మిగతా చానల్స్ తో సరిపెట్టుకుంటారనే అభిప్రాయం కూడా సరికాదు. ఒక్కో చానల్ లో ఒక్కో నచ్చిన కార్యక్రమం ఎంచుకొని మరీ చూడ్డానికి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. ఏ ఒక్క ఎంటర్టైన్మెంట్ చానల్ ఆపినా మొత్తం నెలసరి చందా కట్టటం ఆపేసే ప్రమాదముంది. నిజానికి ఆపరేటర్లు ఈ సాకుతో ఎమ్ ఎస్ వో లకు చెల్లింపులు నిలిపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: