అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పై మరో పిడుగు పడింది. ఓ చిన్న పొరపాటు.. ఏపీకి 736 కోట్ల రూపాయల నష్టం తెచ్చిపెట్టింది. రాష్ట్రవిభజనకు నెలరోజుల ముందునాటి పన్ను రాయితీలు.. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఖాతాలోకాకుండా... తెలంగాణ ఖాతాలో జమకావడమే ఇందుకు కారణం. ఇప్పటికే ఎన్నో విషయాల్లో తగువులాడుకుంటున్న రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు ఇదో తలనొప్పిగా మారింది. ఈ 736 కోట్ల రూపాయలు తిరిగి తెచ్చుకోవడం ఏపీకి పెద్ద సమస్యగా పరిణమించింది. వాస్తవానికి మే నెల వాణిజ్య పన్నులు వసూలు కావడానికి చివరి గడువు జూన్ 20. కానీ జూన్ 2 తెలంగాణ ఆవిర్భవ దినం కావడం వల్ల.. ఆ రోజు నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు విడివిడిగా ఖాతాలు ఏర్పడ్డాయి. జూన్ 2 నుంచే వాణిజ్య పన్నులు రెండు రాష్ట్రాల ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. ఖాతాల నిర్వహణలో అధికారులు తడబడటం వల్ల.. తెలంగాణ ఖాతాలోకి రూ.2382కోట్లు, ఏపీ ఖాతాలోకి రూ.1584కోట్లు జమ అయ్యాయి. వాస్తవానికి జనాభా ప్రాతిపదికన 58శాతం లెక్కప్రకారం.. ఏపీకి 2320కోట్లు రావాలి. కానీ 736కోట్లు తక్కువగా జమయ్యాయి. ఈ మొత్తం తెలంగాణ ఖాతాలోకి చేరాయి. ఈ విషయంపై ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య ఉత్తరాలు నడుస్తున్నా.. వివాదం పరిష్కారమయ్యే సుచనలు కనిపించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య ఇదో కొత్త వివాదంగా రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ఒక్క విషయంలోనే కాదట.. రెండు రాష్ట్రాలమధ్య వాణిజ్య పన్నులకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయట. వీటిలో ప్రధానమైన 12 సమస్యలను గుర్తించి.. కేంద్రం ముందు ఏపీ అధికారులు మొరపెట్టుకున్నారట. ఇప్పుడు నిర్ణయం కేంద్రం చేతిలో ఉంది. మరి కేంద్రం ఎలా డిసైడ్ చేస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: