రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలన గురించి ఊహించుకొన్నది వేరు, జరుగుతున్నది వేరు. ఈ విషయంలో జనాలకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇచ్చిన హామీల గురించి కానీ, చేసిన వాగ్దానాల గురించి గానీ, చేయబోతున్న పనుల గురించి గానీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇవ్వకపోవడంతో జనాలకు ఈ క్లారిటీ వచ్చింది. మాఫీలు, హామీల సంగతి అలా ఉంటే రాజధాని నిర్మాణం బృహత్తర కార్యక్రమం గురించి ఎన్నో ఆశలు పెట్టుకొన్న ప్రజలకు కూడా ఇప్పుడు ఆశాభంగమే ఎదురవుతోంది. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు సచివాలయం వద్ద హుండీలను ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. రాజధాని నిర్మాణం అంటే కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేతికి ఎముక లేకుండా ఖర్చుపెడుతూ చేస్తాయని అనుకొంటే.. ఇప్పుడు తీరా... ఏకంగా హుండీలు పెట్టి డబ్బులు సేకరించేంత సీన్ క్రియేట్ చేయడం ప్రజలను నివ్వెరపోయేలా చేస్తోంది! తెలుగుదేశం వాళ్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని నిధులు తెచ్చుకొని రాజధానిని నిర్మిస్తారని కొంతమంది ఎక్స్ పెక్ట్ చేశారు. మరికొంతమంది ఏమో మోడీ కి చంద్రబాబు కు ఉన్న సాన్నిహిత్యం ద్వారా ఇక రాజధాని నిర్మాణానికి నిధులే నిధులు అని అనుకొన్నారు. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రాజధాని నిర్మాణం అంటూ నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టిందో.. అప్పటికే సగం గాలి పోయింది. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు హుండీలతో పోయింది. అయితే జనాలు ఇప్పటికీ కొన్ని విషయాల్లో ఆనందంగానే ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం హుండీలతో ఆపింది. ఇంకొంచెం తెగించి.. మంత్రుల చేత చిప్పను పట్టించి నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టలేదు... అని జనాలు గొణుక్కొంటున్నారు. మరి నెక్ట్స్ ప్రణాళిక అదేనేమో! మంత్రుల చేత, ప్రభుత్వ ఉద్యోగల చేత చిప్పలు పట్టించి... రాజధాని నిర్మాణం కోసం నిధుల సేకరణ చేస్తారేమో..అలా వచ్చిన డబ్బుతో సింగపూర్ వెళ్లి అధ్యయనాలు నిర్వహించి నిర్మాణాలు చేపడతారేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: