ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరానికి కరువు పరిస్థితులు తప్పేలా లేవు. జూలై మూడో వారంలో కూడా ఆశించినంత వర్షపాతం, కనీస వర్షపాతం నమోదు కాకపోవడంతో.. ఈ యేడాది కరువు కన్ఫర్మ్ అయ్యిందని అనుకోవాల్సి వస్తోంది. జూన్ నుంచినే ఈ సారి కరువు మేఘాలు పలకరించాయి. అక్కడికీ అల్పపీడనాలతోనో, తుఫానులతోనో ఏమైనా వర్షాలు వస్తాయని ఆశించినా... అదీ జరగలేదు. అల్పపీడనాలతో రాయలసీమ, కోస్తాంధ్రలోఉరుములతో కూడిన జల్లులు పడతాయనే వాతావరణ కేంద్ర వారి హెచ్చరికలు వినిపిస్తున్నా.. మేఘాలు అయితే కరుణ చూపడం లేదు. జూలై తొలి రెండు వారాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలతో చాలా చోట్ల రైతులు విత్తనం అయితే వేశారు కానీ... మళ్లీ వర్షాల జాడ లేకుండా పోయింది. దీంతో వేసిన విత్తనాలు అయినా సరిగా మలుస్తాయో లేదో... అనే సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతానికి అయితే వర్షాల అదును దాటిందని... ఇక వర్షాలు వచ్చినా పంట దక్కే అవకాశాలు అంతంతమాత్రమేనని రైతులు అంటున్నారు. అదృష్టవశాత్తూ ఇప్పుడైనా భారీ వర్షాలు వస్తే... ఖరీఫ్ పంట కథ ఎలా ఉన్నా...భూగర్భ జలం పైకి వస్తే... ప్రాజెక్టులు నిండితే రబీ పంటనైనా దక్కించుకోవచ్చని రాష్ట్ర రైతాంగం ఆశలు పెట్టుకొంది. అయితే వరుణదేవుడు మాత్రం కరుణించడం లేదు. కోస్తాంధ్ర, సీమలకు వర్ష సూచనలు ఉన్నా..మేఘాలు ఇక్కడ వర్షించక ఎంచక్కా.. ఒరిస్సా కు వెళ్లిపోతున్నాయి. ఆ ప్రాంతంలో మాత్రం వర్షపాతం పర్వాలేదనే స్థాయిలో కనిపిస్తోంది. మరి ఈ ఏడాదికి కరువు తప్పదనే భావనలోకి అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ రైతాంగం. మరి రైతులను వరుణ దేవుడు నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో వారిని ఆదుకొనేదెవరో!

మరింత సమాచారం తెలుసుకోండి: