పరిస్థితిని చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ కొత్త పల్లి గీత పార్టీ గీతను దాటడం ఖాయమైందని అనుకోవాలి.ఒకవేళ ఆమె ప్రస్తుతానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే నిలబడినా.. తన మాటలతో చంద్రబాబును పొగిడాకా... ప్రతిపక్ష పాత్రకు సెట్ కాదని అనుకోవాలి. సాంకేతికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినా ఆమె పార్టీలో పూజకి పనికిరాని పువ్వు లాగా ఉండాల్సిందే. ఇప్పటికే కర్నూలు ఎంపీ రూపంలో ఇలాంటి వారు ఒకరున్నారు. చంద్రబాబు చెంత వరకూ వెళ్లి వెనకొచ్చిన ఆమె తర్వాత ఇప్పుడు అరకు ఎంపీ కూడా అదే జాబితాలోకి చేరిపోయారు. మరి ఓవరాల్ గా తెలుగుదేశం వాళ్లు వైకాపా తరపున గెలిచిన ముగ్గురు ఎంపీలను నిర్వీర్యం చేసినట్టు అవుతుంది. ఒకరిని తమవైపుకు చేర్చుకొని, ఇద్దరిని తమ అభిమానులుగా మార్చుకొని తెలుగుదేశం వాళ్లు వైకాపా ను దెబ్బ కొడుతున్నారని అనుకోవాలి. అయితే దీని వల్ల ప్రతిపక్షం బలహీనం అవుతుందని తెలుగుదేశం భావిస్తోంది కాబోలు.. గీత వ్యవహారాన్ని గమనించిన తర్వాత అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే... తెలుగుదేశం పార్టీ తమ ఆపరేషన్ ఆకర్షను కొనసాగిస్తోంది. మరి ఇలా ఒక్కో ఎంపీ జగన్ పిడికిలి నుంచి జారిపోవడం వల్ల ఆయన బలహీనుడు అవుతాడా... అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడిప్పుడే జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం పై పోరాటం మొదలు పెట్టాడు. నెల రోజుల గడువు అంటూ... చంద్రబాబుపై విరుచుకు పడటానికి సిద్ధం అవుతున్నాడు. మరి ఇలాంటి నేపథ్యంలో జగన్ పార్టీ నుంచి ఎంపీలను బయటకు లాగడం వల్ల నైతికంగా దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని అనుకోవచ్చు. ఇలా తెలుగుదేశం పార్టీ ఆకర్షవలకు చిక్కుకొంటున్న ఎంపీలపై జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. పోరాటం ఎలా ఉన్నా... ముందు పార్టీని కాపాడు కోవడం పై దృష్టి పెట్టడానికి అయితే సమయం కేటాయించాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: