తెలంగాణ మంత్రులు టి. హరీష్‌రావు, గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డిలను ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్ధులు అడ్డుకున్నారు. ఆదివారం పాతబస్తీలోని సిటీ కళాశాలలో తెలంగాణ గెజిటెడ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు ఇద్దరు మంత్రులు అక్కడికి వచ్చారు. కార్యక్రమం ముగిసాక వారు బయటకు వస్తుండగా తెలంగాణ నిరుద్యోగ విద్యార్ధి జెఎసికి చెందిన విద్యార్ధులు కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసులను ఎలా క్రమబద్ధీకరిస్తారంటూ మంత్రులను నిలదీశారు. ఎన్నికలకు ముందు ఉద్యోగ నియామకాలను అధికారంలోకి రాగానే చేపడతామని ప్రకటించి ఇప్పుడు ఉన్న ఉద్యోగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను నియమిస్తే తమ భవిష్యత్‌ ఏమిటంటూ వారు ప్రశ్నించారు. ఆర్ట్స్‌ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ విశ్వేశ్వరరావు ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. మంత్రులు ఎంత సర్దిచెప్పినా విద్యార్ధులు వినిపించుకోలేదు. పాతబస్తీలో బోనాల పండుగ సందర్భంగా పోలీసులు సిబ్బంది అంతా ఆ బందోబస్తులోనే నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమం విషయం కూడా పోలీసులకు తెలియజేయకపోవడంతో పోలీసులు ఎవరూ ఆ ప్రదేశంలో లేకపోవడంతో కొంత ఇబ్బంది కలిగించింది. చివరకు గన్‌మెన్‌ల సహాయంతో మంత్రులు అక్కడి నుండి వెళ్ళిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: