పాట్నా : బీహార్‌లో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నాయకత్వంలోని ఆర్జేడీతో ఎన్నికల పొత్తు ఉంటుందని అధికార జెడి (యు) సూచన ప్రాయంగా తెలిపింది. వచ్చే నెలలో బీహార్‌లో పది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సీట్లలో ఆర్జేడీతో ఎన్నికల సర్దుబాటు ఉంటుందని, అయితే రెండు పార్టీల నాయకత్వ స్థాయిల్లో జరిగే చర్చల తరువాత తుది నిర్ణయం వెలువడు తుందని ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంజీ తెలిపారు. తమ పార్టీకి సంబంధించినంత వరకూ పొత్తుపై నిర్ణయం జరిగిందని, అయితే ఆర్జేడీ స్పందన కూడా తెలుసుకుంటామని వెల్లడించారు. జెడియు ఆర్జేడీ మధ్య ఎన్నికల సర్దుబాట్లపై సంప్రదింపులు జరిగిన విషయం నిజమేనని, చాలా కాలంగా దీనిపై ప్రచారం జరుగుతోందని, అయితే తుది నిర్ణయం కేవలం ఊహాగానాలు, మీడియా ద్వారా, ప్రజలలో చర్చల ప్రాతిపదికన జరగదని, పార్టీల నాయకుల సమావేశం అనంతరమే కీలక నిర్ణయం ఉంటుందని జెడియు రాష్ట్ర అధ్యక్షులు భషిష్ట నారాయణ్‌ సింగ్‌ చెప్పారు. పది అసెంబ్లీ స్థానాలలో ఆర్జేడీ తమకు ఆరు స్థానాలు కావాలని అడుగుతోందా? అని అడగ్గా ముందు అగ్రస్థాయిలో చర్చలు జరిగితే సీట్ల సర్దుబాటు తుది రూపంలోకి వస్తుందని సింగ్‌ తెలిపారు. ముందు పొత్తు అంగీకారం కుదిరితే తరువాత సీట్ల సర్దుబాట్లు వాటంతట అవే అటుఇటూగా జరిగిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మే చివర్లో అసెంబ్లీలో జెడియు ప్రభుత్వ బలపరీక్ష సమయంలో ఆర్జేడీ మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉప ఎన్నికలకు రెండు పార్టీలూ కలిసి ముందుకు వెళ్లుతాయనే ప్రచారం బలంగా ఉంది. పది స్థానాలకు జరిగే ఎన్నికలు కీలక పరీక్ష వంటివని, బిజెపికి ఇవి చేదు అనుభవం చవిచూపిస్తాయని, ఆ పార్టీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో క్లీన్‌స్వీప్‌ చేస్తామనే కలలు కంటోందని సింగ్‌ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: