ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. విద్యుత్తు, నీటిపారుదల, ఆర్థికవ్యవస్థ, పరిశ్రమలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్‌మెంట్లపై వైట్ పేపర్స్ విడుదల చేస్తామని చెప్పిన ఆయన.. ఇప్పటివరకు విద్యుత్తు, ఆర్థికవ్యవస్థ, ఎంప్లాయ్‌మెంట్, పరిశ్రమల రంగాలపై వీటిని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. తమ ప్రభుత్వం త్వరలో ఐటీ, టూరిజం, టెక్స్‌టైల్స్, బయోటెక్నాలజీ వంటి 11 సబ్‌సెక్టార్లను చేరుస్తూ త్వరలో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తుందన్నారు. ఈ నూతన విధానం ద్వారా ఏడాదికి 50వేల కోట్ల ఆదాయాన్ని సమీకరించవచ్చునని ఆయన చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్, థాయ్‌లాండ్, జపాన్ నుంచి అప్పుడే పారిశ్రామికవేత్తలు తమను సంప్రదించినట్టు తెలిపారు. పారిశ్రామిక రంగంతోబాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్‌మెంట్ రంగాలపై కూడా ఏకకాలంలో చంద్రబాబు ఈ వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి నిలిపామని ఆయన తెలిపారు. ‘‘ఏ ప్రాసెస్ అయినా పారదర్శకంగా వుంటుంది. అవసరమైతేనే మేం రైతుల నుంచి భూములు సేకరిస్తాం. అభివృద్ధి ప్రక్రియలో వారిని భాగస్వాముల్ని చేస్తాం’’ అని ఆయన స్పష్టం చేశారు. గత పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం, స్కామ్‌లు, అవినీతి మూలంగా ఈ రాష్ట్రం ‘‘చీకట్లో కూరుకుపోయిందని’’ చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి పరిశ్రమలకు విద్యుత్ సరఫరా జరగడం ఖాయమన్నారు. తెలంగాణాలో రూ.4వేల కోట్ల మిగులు బడ్జెట్ వుండగా, ఏపీలో రూ.18వేల కోట్ల లోటు బడ్జెట్ వున్నట్టు ఆయన ఆర్థిక రంగంపై విడుదల చేసిన తన శ్వేతపత్రంలో పేర్కొన్న సంగతి తెలిసిందే! ఐటీ రంగానికి సంబంధించి 1997 నుంచి 2004 వరకు నిరంతరం (ప్రతి ఏడాది) 61.4 శాతం పెరుగుదల సాధించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అయితే 2004-2014 మధ్యకాలంలో ఈ ప్రగతి 29.40 శాతం తగ్గిందన్నారు. ఐటీ రంగంపై 14 లక్షల కుటుంబాలు ఆధారపడి వున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ రంగం తరువాత తమ ప్రభుత్వం టూరిజం రంగానికి అధికంగా ప్రాధాన్యమిచ్చినట్టు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: