ఉగ్రవాద భూతం మరోసారి తన పంజావిప్పి.. ప్రపంచానికి హెచ్చరిక పంపింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఆకాశంలో ప్రయాణిస్తున్న దాదాపు 300 వందల మంది ప్రాణాలు... అటు నుంచి అటే గాల్లో కలిసిపోయాయి. ఆప్తులకు చివరి చూపు కూడా నోచుకోకుండా మసిబొగ్గులుగా మారిపోయారు. ఎవరిదో కోపం.. ఎవరిపైనో దుగ్ద.. అమాయకుల ప్రాణాల మీదకు తెచ్చింది. కక్ష ఒకరి మీద.. ప్రతీకారం మరొకరిపైన... పెద్దసంఖ్యలో ప్రయాణికులున్న విమానం కానరాక.. నెలలు గడుస్తున్నా.. జాడ తెలియక గుండె బరువెక్కిన మలేషియాకు అంతలోనే మరో ఘోర విషాదం అనుభవంలోకి వచ్చింది. ఐతే.. ఇది ప్రమాదమైతే.. విధి రాత అని సరిపెట్టుకోవచ్చు.. కానీ కనిపెట్టి.. దారి కాచి.. ఉగ్రవాదులు చేసిన క్షిపణి కావడమే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.. అసలేం జరిగింది..? మలేషియా నుంచి బయలు దేరిన విమానం... ఉక్రెయిన్ - రష్యా సరిహద్దుల్లో కుప్పకూలింది. క్షిపణి దాడి కారణంగానే ఇది జరిగిందన్నది నిర్వివాదాంశం. రష్యా అనుకూలురు ఉండే ప్రాంతంలో సంభవించింది. అక్కడి తిరుగుబాటుదారులే ఈ దుర్ఘటనకు కారకులని ఉక్రెయిన్ సూటిగా ఆరోపిస్తోంది. దానికి సంబంధించి బలమైన సాక్ష్యాధారాలనూ... అంతర్జాతీయ సమాజం ముందుంచుతోంది. గతంలోనూ ఇక్కడ ఉక్రెయిన్‌ యుద్ధ విమానాలను తిరుగుబాటుదారులు పేల్చివేసిన ఘటనలు ఉన్నాయి. అంతేకాదు.. క్షిపణి దాడి తర్వాత రష్యాలో ఉన్న కొందరికి... తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్న ఉగ్రవాదులు సమాచారం చేరవేశారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు కూడా తమ దగ్గర ఉన్నాయని ఉక్రెయిన్‌ అంటోంది. రష్యా మాత్రం ఉక్రెయిన్ లో జరిగిన నేరానికి తనకు ఏం సంబంధమని ఎదురు ప్రశ్నిస్తోంది. రష్యా - ఉక్రెయిన్ గొడవలేంటి.. ? రష్యా- ఉక్రెయిన్ వివాదాలు అర్థంకావాలంటే.. కాస్త లోతుగా పరిశీలించాలి. 1900 సంవత్సరాల్లో సోవియట్‌ యూనియన్‌లోని దేశాల్లో ఉక్రెయిన్‌ కూడా ఒకటి. ఆ తర్వాత కాలంలో సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలాక దాదాపు పాతికేళ్ల క్రితం ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. అప్పటి నుంచి రష్యా ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం చేస్తూ ఆ దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ఉక్రెయిన్ దేశ జనాభాను పరిశీలిస్తే.. దక్షిణ, తూర్పు ప్రాంతంలో రష్యన్‌లు ఎక్కువ. ఉక్రెయిన్లో ఈ రష్యన్లకు పశ్చిమ ప్రాంతంలోని ఉక్రెయిన్లకు మధ్య చాలా విభేదాలున్నాయి. దేశాన్ని ఐరోపా కూటమిలో దేశాన్ని కలపాలని బలంగా వీరు కోరుకుంటారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉక్రెయిన్‌ ప్రధాని యనుకోవిచ్.. అందుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో తీర్మానం చేశారు. ఇదే ఉక్రెయిన్ల ఆగ్రహానికి దారి తీసింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌ అంతర్భాగంలోని క్రిమియాను... రష్యా తనలో కలుపేసుకుంది. అక్కడి ఉక్రెయిన్‌ సైన్యాలను వెనక్కుపంపేసింది. రష్యా గతంలోనూ ఇలాగే చేసింది.. గతంలో కూడా చెచెన్యా, జార్జియా తదితర ప్రాంతాలను రష్యా ఇలాగే తనలో కలుపేసుకుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు కొత్తగా ఎన్నికైన ప్రధాని పెట్రో పొరెషెంకో రష్యాను తమ శత్రువుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ నిత్యం అక్కడ అలజడులు సృష్టించడం ద్వారా తన ప్రయోజనాలను కాపాడుకోవచ్చని రష్యా భావిస్తోంది. అంతే కాకుండా ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. ఇలాంటి సంక్షోభ సమయంలో ఉక్రెయిన్‌ ఈయూ వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నించడం పుతిన్‌కు సహించడం లేదు. ఒక వేళ ఐరోపా కూటమి ఈ దేశానికి సహాయం చేస్తే తన ఆధిపత్యానికి గండి పడుతుందన్న ఆందోళన కూడా మాస్కో వర్గాల్లో ఉంది రష్యా ఏమంటోంది.. ? విమాన ప్రమాద ఘటనపై రష్యా పాత్రపైనే అంతర్జాతీయ సమాజం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రష్యా మాత్రం సరికొత్త వాదనను తెరమీదకు తెచ్చింది. బ్రిక్స్‌ సమావేశానికి హాజరైన పుతిన్‌ తిరిగి వచ్చేది ప్రస్తుతం మలేషియా విమాన ప్రమాదం జరిగిన మార్గంలోనేనని.. పుతిన్‌ ప్రయాణం గురించి తెలుసుకున్న ఉక్రెయిన్‌ దళాలు... ఆయన్ని అంతమొందించాలన్న లక్ష్యంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాయని చెబుతోంది. రెండూ విమానాలు ఆకాశంలో విహరించేప్పుడు దాదాపు ఒకేలా ఉంటాయంటూ కొన్ని ఊహాచిత్రాలనూ విడుదల చేసింది. ఇలా సరికొత్త కుట్ర సిద్ధాంతాన్ని రష్యా వర్గాలు తెరమీదకు తెచ్చాయి. ఒక వేళ రష్యా అధ్యక్షుడ్ని హత్య చేసి ఉక్రెయిన్‌ మనుగడ సాగించేంత సీన్ ఉక్రెయిన్ కు ఉందా.. అసలు అంత సాహసం ఉక్రెయిన్ అనే చిన్న దేశం చేస్తుందా.. అన్న అనుమానాలూ సహజంగా కలిగేవే. ఉక్రెయిన్ వాదన ఏంటి..? తన గడ్డపై జరిగిన ఈ నరమేథంపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలని ఉక్రెయిన్‌ పట్టుపడుతోంది. దీనికి అమెరికా, ఆస్ట్రేలియా దన్నుగా నిలుస్తున్నాయి. భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను చేధించగలగిన క్షిపణులు... రష్యా తమ అనుకూలురుగా ఉన్న ఉక్రెయిన్‌ వేర్పాటు దళాలకు అందించిందని అమెరికా ఆరోపిస్తోంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంపై... రష్యాకు పట్టు ఉందని... పుతిన్‌కు తెలియకుండా ఈ ఘోరం జరిగే అవకాశం లేదంటూ... అమెరికా.. రష్యాను అంతర్జాతీయ సమాజం ముందు దొంగగా నిలిపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఆయిల్ ఆధిపత్యమే ఉసురు తీసిందా...? ఉక్రెయిన్‌ ఈయూలో కలిస్తే తన ఆధిపత్యం తగ్గుతుందనే కాదు ఉక్రెయిన్‌లో ఉన్న అపార ఇంధన వనరులపై తన పట్టు ఎక్కడ పోతుందో అన్న భయం కూడా రష్యాలో ఉంది. ఇప్పటికే అధిక ఇంధన కొరతను ఎదుర్కొంటున్న ఐరోపా కూటమి... ఉక్రెయిన్‌లోని ఇంధన నిక్షేపాలను తమ అధీనంలోకి తెచ్చుకోవచ్చని... తద్వారా తక్కువ ఖర్చుతోనే సహజ వాయువును పొందవచ్చని బావిస్తోంది. ఇదే జరిగితే ఆ కూటమి దేశాలకు ఇంధన సరఫరా చేస్తున్న రష్యా ఆదాయానికి గండి పడుతుంది. ఇప్పటికే రష్యాను నిలువరించేందుకు అమెరికా... మాస్కోపై కొన్ని ఆంక్షలు విధించింది. అందుకే... ఉక్రెయిన్‌లోని అధిక భాగాలను తనలో కలుపుకొని... ఇంధన నిక్షేపాలపై పట్టు నిలుపుకోవాలన్నది పుతిన్‌ మంత్రాంగం. ఈ ఆధిపత్య పోరులో భాగంగా... అక్కడున్న వేర్పాటు వాదులకు నిధులు ఆయుధాలు సమకూర్చుతూ... రష్యా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నిత్యం అల్లర్లు సృష్టిస్తూ... తన ప్రయోజనాలను కాపాడుకుంటోంది. అందులో భాగంగా... దక్షిణ ఉక్రెయిన్‌లోని వేర్పాటు వాదులకు మాస్కో క్షిపణులు అందించిందని... వివిధ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే తమ దగ్గరున్న క్షిపణులు అంత ఎత‌్తులో ఉన్న లక్ష్యాలను నేల కూల్చలేవని వేర్పాటు వాదులు వాదన వినిపిస్తున్నారు. సమిథలు అమాయకులే.. ఎవరి వాదనలు ఎలా ఉన్నా..పెద్ద దేశాలు, కూటముల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్నపోరులో ఉక్రెయిన్‌ ఒక్కటే కాదు... మలేషియా లాంటి అనేక దేశాలు గర్భశోకాన్ని అనుభవిస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి దుర్ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. వీటి వెనుక ఉన్నది ఆధిపత్య స్వార్ధమే. అయితే ప్రతి సారీ బలవుతున్నది... అన్నెం పున్నెం ఎరుగని ప్రయాణికులే..! అమెరికా- రష్యా మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా.. 80వ దశకంలో ప్రాంతంలో కొరియా బలైంది. న్యూయార్క్‌ నుంచి సియోల్‌కు బయలు దేరిన కొరియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కె.ఎ.ఎల్ - 007 విమానాన్ని రష్యా భూభాగంలో కూల్చేశారు. ఈ దుర్ఘటంలో 269 మంది అమాయకులు రాలిపోయారు. దీన్ని పేల్చివేసింది సోవియట్‌ దళాలు. తమ గగనతలంపై విహరిస్తున్న విమానం.. అమెరికా నిఘా సంస్థదని భావించిన దళాలు... రెండు యుద్ధ విమానాల సాయంతో దానిని వెంబడించి మరీ పేల్చేశారు. అంత మందిని పొట్టన పెట్టుకున్నాక తీరిగ్గా.. పొరపాటుకు చింతిస్తున్నామని సోవియట్‌ ప్రకటించింది. ఆ ప్రకటనలేవీ... ఈ ప్రమాదంలో మరణించిన వాళ్ల కుటుంబాలకు స్వాంతనను ఇవ్వలేక పోయాయి. మారాల్సింది అగ్రరాజ్యాల వైఖరే ఎక్కడో చోట అగ్గిని రాజేసి.. ఆ మంటతో తమ చలికాచుకునే దేశాలు... ప్రపంచాన్ని శాసిస్తున్నంత కాలం... ఈ ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి..! తాజా పరిణామాలు ఏ రక్త చరిత్రను లిఖించబోతున్నాయి. ఆధిపత్య పోరుతో ... అపారమైన వనరులను తమ హస్తగతం చేసుకునేందుకు... ఆయా దేశాలు కుట్రలు పన్నుతున్నంత కాలం.. ఈ నరమేథాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఏ సంబంధం లేకున్నా వందల మంది ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. ఈ గాయాలు ఎప్పటికీ మానేవీ కావు. భావి తరాలకు నెత్తుటి మరకలను మిగిల్చేవే. వీటిని రూపుమాపగలమని భావిస్తున్న ఐక్యరాజ్యసమితి కూడా... ప్రపంచంపై ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడుతున్న ఐదు శాశ్వత సభ్య దేశాల కబంధ హస్తాల్లో పిండిబొమ్మగా మారింది. అగ్ర రాజ్యాల వైఖరి మారనంత కాలం... మలేషియా, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, ఇరాన్‌, కొరియా వంటి దేశాలకు కడుపుకోత తప్పదు. భవిష్యత్తు శాంతికి మనుగడ ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: