జగన్ కు సీఎం కావాలన్న కోరిక ఎంత బాగా ఉందో రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ తెలుసు. అసలు రాజకీయాల్లోకి ఎంటర్ కావడంతోనే అబ్బాయి గారి కన్ను అధికారపీఠం పైనే పడింది. రాజరికస్వామ్యం తరహాలో నాన్నారి సీటు నాకే దక్కుతుందంటూ ఆయన చేసిన యాగీ అంతా ఇంతా కాదు. అధిష్టానం ఏం చెబితే అది కిక్కురుమనకుండా చేసే కాంగ్రెస్ లో ఏకంగా సోనియా గాంధీపైనే విమర్శలు చేశాడంటే.. అది కేవలం సీఎం కుర్చీపై ఉన్న ప్రేమతోనే. దాన్ని ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతోనే జగన్ రాజకీయ సాహసాలు చేశాడు. ఎన్ని సాహసాలు చేసినా.. ఎంత ఓపిగ్గా సీఎం కుర్చీ కోసం ఎదురు చూసినా... గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ వ్యూహం ఫలించలేదు. దేవుడు దయతలిస్తే.... ఈ మాట జగన్ తరచూ అంటుంటాడు. స్వతహాగా ఆస్తికుడైన జగన్.. తరచూ దైవ జపం చేస్తుంటాడు. అయినా ఆయన ప్రేమించే దేవుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కరుణించలేదు. అధికారపీఠం దక్కలేదు. కాకపోతే బలమైన ప్రతిపక్ష స్థానం ఇచ్చాడు. దేవుడి తీర్పుపై కోపంగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి జగన్ ది. మరో ఐదేళ్ల దాకా వేచి చూడటం మినహా వేరే ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో లేదు. ఐతే తాజా ఘటనలు చూస్తుంటే దేవుడు కూడా మనసు మార్చుకున్నట్టే కనిపిస్తున్నాడు. జగన్ కు అనుకూలంగా ఆయనకు కూడా మొగ్గుచూపుతున్నాడు. అందుకు మొన్నటి స్థానిక ఎన్నికల ఫలితాలే సాక్ష్యం.. స్థానిక ఎన్నికల్లో బలాబలాలు చెరిసమానం అయినప్పుడు లాటరీ వేసి ఫలితం తేలుస్తారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో లాటరీ వేసిన చోటల్లా నూటికి 90 శాతం ఫలితాలు జగన్ పార్టీకి అనుకూలంగా రావడం విశేషం. మొన్నటి జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్ ఫలితం, తాజాగా నెల్లూరు జడ్పీ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ల ఎన్నికల్లో దేవుడు జగన్ పార్టీనే కరుణించాడు. తెదేపా రాజకీయ ఎత్తుగడలెన్నో వేసి కొంతమంది జడ్పీటీసీలను లాక్కున్నా.. అంతిమ ఫలితం మాత్రం జగన్ కే అనుకూలంగా వచ్చింది. దేవుడు కూడా మనసు మార్చుకుంటున్నాడేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: