పోలవరం ముంపు మండలాలు త్వరలోనే ఏపీలో కలసిపోనున్నాయి. మేం తెలంగాణలోనే ఉంటామంటూ వారు .. ఎన్ని ఆందోళనలు చేసినా.. అదంతా అరణ్య రోదనేకానుంది. తెలంగాణ ఎంపీలు ఎంత వ్యతిరేకించినా.. పోలవరం బిల్లు ఉభయసభల ఆమోదం పొందింది. ఇక రాజముద్ర పడటమే తరువాయి. అవన్నీ ఆంధ్రప్రదేశ్ ఆధీనంలోకి వెళ్తాయి. అంతవరకూ బాగానే ఉన్నా.. వీరికి ఎవరు ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తారన్న విషయం ఇప్పుడు వివాదాస్పదం కానుంది. ఎందుకంటే.. ఈ బదలాయింపు ఎన్నికల తర్వాత జరుగుతోంది. ఇప్పటికే సాధారణ ఎన్నికలు పూర్తయిపోయాయి కాబట్టి వీరికి ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాలు ఏపీకి బదలాయింపు కావడంతో .. ప్రాంతాలు ఏపీలోనూ.. వారి ప్రజాప్రతినిథులు తెలంగాణలోనూ ఉండిపోతున్నారు.ఇప్పుడు ఈ ముంపు గ్రామాల ప్రజలకు ఎంపీలెవరు, ఎమ్మెల్యేలవరనేది అర్థంకాని ప్రశ్న. ఈ బలవంతపు బదలాయింపు వల్ల తాము ఏ రాష్ర్టానికి కాకుండా పోయామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఎన్నికలు జరిగి ఆరు నెలలు కూడా కావడం లేదు. ఇక మిగిలిన నాలుగున్నర ఏళ్ల కాలంలో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి.. ఎవరు తమను పట్టించుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ముంపు మండలాల్లో బూర్గంపాడు, వేలేరుపాడు, కుక్కునూరు అనే మూడు మండలాలు అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనివి. ఈ నియోజకవర్గానికి తాటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే. ఆయన ఎన్నికైనప్పుడు ఆ ప్రాంతం అంతా తెలంగాణలో ఖమ్మం జిల్లాలో భాగంగా ఉంది. విశేషమేమిటంటే.. ఇప్పుడు ఆయన సొంత గ్రామం కన్నాయిగుట్ట కూడా ఆంధ్రలోకి వెళ్లిపోతోంది. తన సొంతూరే పక్కరాష్ట్రానికి వెళ్లిపోవడంతో తాను ఏ రాష్ట్రంవాడో అర్థంకాని పరిస్థితి ఈ ఎమ్మెల్యేది. తనకు ఓట్లేసి గెలిపించిన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల వారితోపాటు తననూ ఏపీకి చెందిన వ్యక్తిగా ఆర్డినెన్స్ మార్చివేసిందని రెండు రాష్ట్రాలలో తన నియోజకవర్గ ప్రజలు ఉన్నారని,కాని తాను ఇప్పుడు ఏమి చేయాలో తెలియడం లేదని ఆయన వాపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: