మొన్నటిదాకా విద్యార్థులే టీఆర్ఎస్ ను, ఆ పార్టీ నేతలనూ, అధినాయకుడు కేసీఆర్ నూ భుజాల మీద మోసారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నడుం కట్టిన టీఆర్ఎస్ బృందానికి అడుగడుగునా బాసటగా నిలిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయంలో ప్రతీ పల్లెనా విద్యార్థులు కాంగ్రెస్, తెలుగుదేశం పక్షాలకు నిరసన తెలిపారు. పట్టణమైనా, పల్లెటూరైనా పర్యటన పెట్టుకోవాలంటే నాటి నాయకులు గజగజలాడిన సందర్భాలు కోకొల్లలు. అప్పుడే విద్యార్థులు, నిరుద్యోగులనే అస్త్రంగా మలుచుకుని, నిరసన జ్వాలలు ఎగిసి పడేలా చేసిన గులాబీ నేతలకు ఇప్పుడు అదే వర్గం నుంచి ఆందోళనలు తీవ్రమయ్యాయి. పద్నాలుగేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు అధినేత కేసీఆర్. నాటి నుంచి తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలూ పార్టీకి, కేసీఆర్ కు బాసటగా నిలిచాయి. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం కోటి కలలు గన్న విద్యార్థి లోకం అయితే టీఆర్ఎస్ ను తమ పార్టీగా భావించి భుజాలపై మోసింది. 2009 లో కేసీఆర్ ఆమరణ దీక్ష తర్వాత విద్యార్థి సమాజం టీఆర్ఎస్ నేతలకు ఇచ్చిన మద్దతు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా విద్యార్థి ఉద్యమానికి గుండెకాయ లాంటి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చాలా మంది నాయకులకూ దేహశుద్ధి జరిగింది. కానీ ఎన్నడూ టీఆర్ఎస్ నేతలకు మాత్రం కనీస నిరసన కూడా ఎదురుకాలేదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రత్యేక రాష్ట్ర తెచ్చిన ఘనతతో సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేత హోదాలో సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని క్రమంగా నెరవేరుస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడమే విద్యార్థి, నిరుద్యోగ లోకానికి ససేమిరా నచ్చడం లేదు. మేనిఫెస్టోలో ఈ హామీ పెట్టినప్పటి నుంచి దీనిని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా హామీ అమలు చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్దీకరిస్తాం అనడంతో నిరుద్యోగుల నిరసనలు మిన్నంటాయి. ఉద్యోగాల కోసమే ఉద్యమాలు చేసిన తమ నోట్లో మట్టి కొట్టే పని చేసిందని ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. తాము చెయ్యెత్తి జైకొట్టిన టీఆర్ఎస్ నేతలకే ఇప్పుడు నిరసన రుచి చూపిస్తున్నారు. ఇంతకాలం విద్యార్థులు, నిరుద్యోగుల జేజేలు అందుకున్న గులాబీ దళంలోని మంత్రులు ఇప్పుడు వాళ్ల చేతుల్లోనే తమ దిష్టిబొమ్మల దహనాన్ని చూడాల్సి వస్తోంది. పల్లె, పట్టణం అన్న తేడా లేదు... టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ ఆందోళన తప్పడం లేదు. హైదరాబాద్ లోని సిటీ కాలేజీలో కార్యక్రమానికి వచ్చిన మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలకు సైతం నిరసనలే స్వాగతం పలికాయి. పలుచోట్ల ఇప్పటికే సీఎం కేసీఆర్ తో పాటు మంత్రుల దిష్టిబొమ్మలూ దగ్దమయ్యాయి. పువ్వులమ్మిన చోటనే కట్టెలు అమ్మాల్సి రావడం అంటే ఇదే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: