సాక్షి దిన పత్రిక.. తెలుగు మీడియాలో ఈనాడు గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తూ దూసుకొచ్చన పత్రిక. ఈనాడు పత్రికకు పోటీగా తెలుగులో గతంలో ఉదయం, వార్త వంటి పత్రికలు వచ్చినా.. అవి ఈనాడుకు పోటీగా నిలువలేకపోయాయి. అలాంటి ఈనాడు సర్క్యులేషన్ దరిదాపుల్లోకి వచ్చింది సాక్షి ఒక్కటే. తనను టార్గెట్ చేసుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు పోటీగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టించిన ఈ సాక్షి.. తర్వాత కాలంలో ఆయన కొడుకు జగన్ కు అండగా నిలిచింది. వై.ఎస్. చనిపోయేనాటికి జగన్ కేవలం ఎంపీ మాత్రమే. క్రియాశీల రాజకీయల్లోనూ పెద్దగా లేడు. సాధారణంగా కాంగ్రెస్ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు మరణించినా వారి కొడుకులు ఎవరూ వారసులుగా నిలదొక్కుకోలేదు. అలాంటింది వైఎస్ మరణించిన తర్వాత కూడా జగన్ రాజకీయంగా ఓ శక్తిగా ఎదిగాడంటే అందుకు సాక్షి మీడియా ఓ ప్రధాన కారణమని వేరే చెప్పనక్కర్లేదు. సొంతంగా మీడియా ఉంటే తప్ప.. ఆ రెండు పత్రికల ప్రచారాన్ని ఎదుర్కోలేమన్న ఉద్దేశంతో వైఎస్ ఏర్పాటు చేసిన సాక్షి.. జగన్ ఎదుగుదలకు తోడ్పడింది. ఐతే, జగన్ ఎదుగుదలకు తోడ్పడిన సాక్షి మీడియానే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో... జగన్ పరాజయానికి కారణమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలు చేస్తోంది ఎవరో ప్రత్యర్థులు కాదు.. తెలుగుదేశం నేతలో.. కాంగ్రెస్ నాయకులో కాదు.. సాక్షాత్తూ వైకాపా నేతలే ఈ మాటలు అంటున్నారు. సాక్షి దినపత్రిక, టీవీ చానల్‌ వల్లే జగన్‌ ముఖ్యమంత్రి కాలేకపోయారని వైకాపా నేత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ సొంత మీడియాలో ప్రదర్శించిన అతి విశ్వాసం కారణంగానే అధికారంలోకి రాలేకపోయారని విశ్లేంచారు. ఎన్నికల సమయంలో సాక్షి పత్రిక ప్రచురణలు, చానల్‌ ప్రసారాలు జగన్‌తో పాటు తమ పార్టీలో అతి విశ్వాసాన్ని కల్పించాయని ఆయన వాపోయారు. కాస్త ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని మరికాస్త కష్టపడితే విజయం సొంతమయ్యేదన్నారు. ఈయన మాటల్లోనూ వాస్తవముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: