వరుస సమీక్షలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పెట్టుబడులపై దృష్టి సారించారు. సింగిల్ విండో ద్వారా అనుమతులు జెట్ స్పీడుతో ఇస్తామని ప్రకటించిన టి-సర్కార్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అత్యంత యోగ్యమైన ప్రాంతమని అమెరికా ప్రతినిధి బృందానికి వివరించి వారినుంచి సానుకూల సంకేతాలను రాబట్టారు. విదేశీ పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. వివిధ దేశాలను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కొత్త రాష్ట్రంలో సానుకూలతలు, రాయితీలను తెలిపేలా బ్లూప్రింట్ ను కూడా అధికారులు రెడీ చేస్తున్నారు. హైదరాబాద్ నగరం భూకంపాలకు దూరంగా ఉండే ప్రదేశమని, పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు, ప్రగతి సాధించేందుకు అనువైన నగరమని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భరోసా ఇస్తున్నారు. తనను కలిసిన అమెరికా ప్రతినిధి బృందంతో కెసిఆర్ ఇదే విషయాన్ని వివరించారు. తమ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో పారిశ్రామిక అవసరాల కోసం మూడు లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని కెసిఆర్ వివరించారు. అటు తాము తెలంగాణలో పరిశ్రమలు స్థాపించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమని అరుణ్ కుమార్ నేతృత్వంలోని యూఎస్ ప్రతినిధి బృందం కెసిఆర్‌కు తెలిపింది. త్వరలో భారత్‌లో పర్యటించే అమెరికా అధ్యక్షుడు ఒబామా టూర్ షెడ్యూల్‌లో హైదరాబాద్ నగరాన్ని చేర్చాలని కూడా కెసిఆర్, ప్రతినిధి బృందాన్ని కోరారు.  అలాగే హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ భవనం నిర్మిస్తే, భాగ్య నగరం ప్రతిష్ట పెరుగుతుందని కెసిఆర్ చెప్పారు. ఈ సూచన పట్ల సానుకూలంగా స్పందించిన అరుణ్ కుమార్ బృందం, అందుకు తమ ప్రభుత్వం సిద్ధమేనని తెలిపింది. మరోవైపు భాగ్యనగరంలో అమెరికా - ఇండో అమెరికన్ల సదస్సు నిర్వహణ అవకాశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవల కాలంలో పారిశ్రామిక దిగ్గజాలు వరుసగా కేసీఆర్ ను కలుస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆశక్తిని చూపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా టీ-సీఎంతో భేటీ కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: