రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీ నారాయణ, వట్టి వసంత కుమార్, డొక్కా మాణిక్య వరప్రసాద్, కాసు వెంకటక్రిష్ణా రెడ్డి, కోండ్రు మురళి... మొన్నటిదాకా సమైక్య రాష్ట్రానికి మంత్రులుగా వెలిగిన వారు వీళ్లంతా. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేని ఈ ఏపీ కాంగ్రెస్ నాయకులంతా పార్టీ ప్రక్షాళనకు చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నారు. అలా పని చేయాలి, ఇలా పని చేయాలి కార్యకర్తలకు క్లాసులు పీకుతూ ముందుకు సాగుతున్నారు. అయితే స్టేజీ మీద కూర్చున్న నాయకుల కంటే ముందు కూర్చునే కార్యకర్తల సంఖ్య కాస్త తక్కువే అనుకోండి. ముందు కూర్చున్న వారిలోనూ మీడియా ప్రతినిధులే ఎక్కువగా ఉంటుండడం మరో కొసమెరుపు. ఇక అసలు విషయానికి వస్తే... మొన్నటిదాకా మంత్రి పదవులు ఉద్దరించిన వీళ్లంతా ప్రస్తుత ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం రుణాల మాఫీ చేయలేక ఇచ్చిన హామీలను మాఫీ చేస్తోందని పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇటు టీడీపీ, కేంద్రంలో అటు బీజేపీ ఎన్నికల్లో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించాయని విమర్శించారు. మరో మాజీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఏపీ ప్రభుత్వాన్నే, తెలంగాణ సీఎంనూ వదిలిపెట్టలేదు. ఇరు రాష్ట్రాల సీఎంలూ ముఖ్యమంత్రుల్లా కాకుండా... తమ రాష్ట్రాలకు ఛాంపియన్ లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వీళ్లిద్దరు మాత్రమే కాదు... కన్నా లక్ష్మీనారాయణ, వట్టి వసంత కుమార్... ఇలా మాజీ మంత్రులంతా ప్రస్తుతు ముఖ్యమంత్రులపై విమర్శల దాడి చేశారు. రెండు గంటలపాటు గుంటూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహించి, అంతే సమయం పాటు విలేకరుల సమావేశంలోనూ వీరదంచుడు దంచారు. ఒకరి వెనుక ఒకరు మాట్లాడుతూ పోటీ పడి మరీ ప్రభుత్వాల పని తీరుపై విరుచుకుపడ్డారు. పాపం కాంగ్రెస్ నేతలు ఎన్ని చోట్ల విమర్శలు కురిపించినా... అటు టీడీపీ నుంచి కానీ, ఇటు టీఆర్ఎస్ నుంచి కానీ ఎలాంటి స్పందనా రావడం లేదు. చచ్చిన పామును కొట్టడం దండగ అని టీడీపీ, పక్క రాష్ట్రం వాళ్ల విమర్శల పై మనమేం మాట్లాడతామని టీఆర్ఎస్... ఎవరి పనిలో వాళ్లే నిమగ్నమయినట్లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: