ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా మరికొన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, అసోం రాష్ట్రాల మంత్రివర్గాల్లో సీనియర్ మంత్రులు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. మహారాష్ట్రలో నారాయణ రాణె, అసోంలో హేమంత్ బిస్వా శర్మ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయడంతోపాటు తక్షణం సిఎంలు పృథ్వీరాజ్ చవాన్, తరుణ్ గొగోయ్‌లను తప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాలకే అసమ్మతి స్వరం పరిమితం కాలేదు. హర్యానా, జమ్ము కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాల్లోనూ ముసలం మొదలైంది. అయితే ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాత్రం కొంత మంతి నేతలు తమ సొంత ప్రయోజనాలే ప్రధానంగా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీ ప్రయోజనాలేమీ ఇందులో ఇమిడి లేవని చెప్పారు.  రాజ్యసభ సభ్యుడు వీరేంద్ర సింగ్, మరోదఫా హర్యానా సిఎం భూపీందర్ సింగ్‌ను తప్పించాల్సిందేనని పట్టు బట్టారు. అయితే వీరేంద్ర సింగ్ త్వరలో జరిగే ఎన్నికల్లోగా బిజెపిలో గానీ, ఐఎన్ఎల్డీలో గానీ చేరాలని, లేకపోతే సొంత పార్టీ స్థాపించాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉంటే రెండుసార్లు ఎంపిగా ఎన్నికైన జమ్ము కాశ్మీర్ మాజీ ఎంపి చౌదరీ లాల్ సింగ్, పార్టీని వీడడంతోపాటు త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తికర పరిణామం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలు అసమ్మతి భావుటా ఎగురవేశారు. అయితే ఓ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత మాత్రం తమకు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలే ఆందోళన కలిగిస్తున్నాయని అంగీకరించారు. అసోంలో ప్రజా నాయకుడిగా పేరొందిన బిస్వా శర్మ వైదొలిగితే నష్టం వాటిల్లుతుందన్నారు. నారాయణ రాణే సొంత కొడుకునే లోక్ సభ ఎన్నికల్లో గెలిపించుకోలేక పోయారని, మరి చవాన్ స్థానంలో ముఖ్యమంత్రిగా నియమిస్తే తమకు ఉపయోగ పడుతుందా? అని ఆ నేత వ్వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: