కొత్త రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టిన చంద్రబాబు సర్కారుకు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వానికీ ఎదురుకాని కొత్త ఇబ్బంది ఎదురవుతోంది. రాజధాని నిర్మించాలంటే.. వేల ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూమి ఎంతగా అందుబాటులో ఉన్నా.. దానితోనే నిర్మాణం పూర్తి కాదు. మరి ఇప్పుడు భూసేకరణ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈమధ్యనే భూసేకరణ కోసం ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం భూసేకరణ జరపడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఎంత వేగంగా ఈ ప్రక్రియ జరిపినా.. కనీసం రెండేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు. భూసేకరణ కోసం కొత్త చట్టం ఎందుకు కష్టమో ఓసారి పరిశీలిద్దాం.. దీని ప్రకారం.. ముందుగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో ఇద్దరు సామాజిక శాస్త్రవేత్తలు, ఇద్దరు స్థానిక సంస్థల ప్రతినిధులు, ఇద్దరు పునరావాస అంశాల నిపుణులతో పాటు మరో సాంకేతిక నిపుణుడు ఉంటారు. ఈ బృందం ప్రభుత్వం సేకరిస్తున్న భూమి ఉద్దేశాలను పరిశీలించటంతో పాటు ఆ భూమిని వేరే అవసరాలకు ఏమైనా ఉపయోగించే అవకాశాలున్నాయో లేదో పరిశీలిస్తారు. వారు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశాకే.. భూసేకరణకు అనుమతి లభిస్తుంది. భూ సేకరణకు భూ యజమానులను ఒప్పించేందుకు గ్రామసభలు నిర్వహించటం, పరిహారం ఎంత కోరుకుంటున్నారు, భూమి విలువ ఎంత.. అనే అంశాలు పక్కాగా నమోదు చేయాలి. భూ యజమానుల అభిప్రాయాలు తీసుకోవాలి. అంతేకాదు మార్కెట్ రేటుకు కొన్ని రెట్ల పరిహారం అందజేయాలి. అందరూ ఒప్పుకున్నాకే భూ సేకరణకు అనుమతిస్తారు. విభజన తరువాత ముఖ్యపట్టణం లేకుండా పోయిన ఆంధప్రదేశ్ కు నూతన రాజధాని నిర్మించాలంటే కనీసం ఇరవై వేల ఎకరాలు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా. ఈ చట్టంతో ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న రాష్ట్రప్రభుత్వం తమకు దీని నుంచి వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: