ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా.. ఆ తర్వాత ప్రయారిటీ ఎవరిదన్నది ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారుతుంది. టీడీపీలో ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు నెంబర్ టూగా ఉండేవారు. టీడీపీ పగ్గాలు చంద్రబాబు అందుకున్న తర్వాత.. రెండో స్థానానికి ఎందరో నేతలు పోటీపడ్డారు. సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ టూ ప్లేస్ లో ఉన్నవారికి హోంశాఖ ఇవ్వడం ఆనవాయితీ.. ఒకప్పుడు నల్గొండ జిల్లా నేత ఎలిమినేటి మాధవరెడ్డి ఆ స్థానంలో ఉండేవారు. ఆయన కూడా హోంశాఖ నిర్వహించారు. ఆ తర్వాత చాలాకాలం పాటు దేవేందర్ గౌడ్ ఆ స్థానంలో కొనసాగారు. ఆయన కూడా హోంశాఖ నిర్వహించారు. దేవేందర్ గౌడ్ తర్వాత.. ఆ స్థానాన్ని ఎవరూ పూర్తిగా ఆక్రమించలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎర్రన్నాయుడు, యనమల వంటి వారు దాదాపు సెకండ్ ప్లేస్ కు దగ్గరగా ఉండేవారు. రాష్ట్రం విడిపోయాక.. ఆంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చాక.. మళ్లీ ఈ సెకండ్ ప్లేస్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. యనమల చురుగ్గానే ఉన్నా.. ఆయనకు హోంశాఖ వంటి కీలక శాఖ దక్కలేదు. అయినా కేబినెట్లో ఆయనే సీనియర్. అనూహ్యంగా ఇప్పుడు సెకండ్ ప్లేస్ పాత్రకు కొత్త పోటీదారు దూసుకొచ్చాడు. ఆయనే పురపాలశాఖ మంత్రి పి. నారాయణ. కనీసం ఒక్కసారి కూడా ఎన్నికల్లో పాల్గొనని ఈయన.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏకంగా కేబినెట్ మంత్రి అయ్యారు. అంతే కాదు.. ప్రభుత్వంలో ముఖ్యమైన విషయాల్లో ఆయనే కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజధాని రూపురేఖల కమిటీ ఛైర్మన్ ను చేయడం ద్వారా ఆయనకు ఎంత ప్రాధాన్యం ఉందో.. చంద్రబాబు చెప్పకనే చెప్పారు. నారాయణకు ఈ స్థాయి ప్రాధాన్యం దక్కడంపై టీడీపీ సీనియర్లు చాలా అసహనంతో ఉన్నారట. మొత్తానికి నారాయణ ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉన్నారన్నది ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ అంగీకరించే మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: