రాయల సీమలో పార్టీ బలోపేతానికి భారతీయ జనతా పార్టీ చర్యలు చేపట్టింది. మాజీ కేంద్ర మంత్రి, దివంగత మాజీ ముఖ్య మంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తనయు డు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ప్రారంభిం చింది. కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు సలహాతో రంగం లోకి దిగిన మరో మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కర్నూలు చేరుకుని సూర్యప్రకాష్‌రెడ్డితో మంతనాలు జరుపుతున్నట్లు అత్యంత విశ్వసనీ యంగా తెలిసింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని, వచ్చే పదేళ్ళ వరకు తిరిగి కాంగ్రెస్‌ పార్టీ కోలుకోలేని పరిస్థితిలో ఉందని, ఈ నేపధ్యంలో ఆ పార్టీని వీడడమే మంచిదని కావూరి హితవు పలికినట్లు సమాచారం. కర్నూలులో మకాం వేసిన కావూరి ఢిల్లిలోని భాజపా అగ్రనేతలతో సూర్యప్రకాష్‌రెడ్డిని ఫోన్‌లో మాట్లాడించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీని వీడే అంశానికి సంబంధించి ఇప్పటికిప్పుడు తాను నిర్ణయం తీసుకోలేనని, సన్నిహితులు, కుటుంబసభ్యులు తనకు ఆత్మీయులైన వారితో చర్చించి ఆ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని సూర్యప్రకాష్‌రెడ్డి ఈ సందర్భంగా చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు దగ్గుబాటి పురందేశ్వరి, కావూరి సాంబశివరావుతోపాటు పార్టీకి చెందిన ఇతర నేతలు ఎన్నికలకు ముందు, ఆ తర్వాత భాజపా తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో భాజపాకు మొదటినుంచీ నాయకత్వం పటిష్టంగా లేదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నామరూపాలు లేకుండా పోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందు కు భాజపా నాయకత్వం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే పురందేశ్వరిని కడప జిల్లా రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించింది. అనుకున్న ఫలితం రానప్పటికీ ఆ ప్రాంతంపైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పార్టీ పటిష్టతకు కృషిచేయాలని నాయకత్వం పురందేశ్వరిని కోరింది. పురందేశ్వరికి తోడుగా రాయలసీమలో మరికొంతమంది బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుంటే అనుకున్న ఫలితాన్ని సాధించవచ్చని నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిని పార్టీవైపు తిప్పుకునేందుకు నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: