‘‘గుంటూరు నుంచి కర్నూలు వరకు ఆరు జిల్లాలు ఉన్నాయి. గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు ఏడు జిల్లాలు ఉన్నాయి. ఆరు జిల్లాల జనాభా 2.15 కోట్లు. ఏడు జిల్లాల జనాభా 2.78 కోట్లు. అలాగే, గుంటూరు - కృష్ణా మధ్య ప్రాంతానికి అనంతపురంలోని చివరి ప్రదేశం 545 కిలోమీటర్లు. శ్రీకాకుళంలోని చివరి ప్రదేశం 624 కిలోమీటర్లు. అందుకే, విజయవాడ - గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తే అందరికీ సమాన దూరంలో ఉంటుంది. జనాభాకూ మధ్యలో ఉంటుంది’’ అని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎంపికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీకి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అన్నీ విజయవాడ - గుంటూరు మధ్య ఉన్నాయన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌, రెసిడెంట్‌ కమిషనర్‌ సతీష్‌ చంద్రలతో కలిసి మంగళవారం ఆయన శివరామకృష్ణన్‌ కమిటీతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం, అన్ని జిల్లాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను వివరించారు. రాజధాని ఎంపికపై కేంద్రం సూచించిన నాలుగు అంశాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మరో రెండు అంశాలపై కమిటీతో చర్చించారు. భవిష్యత్తులో జరిగే విప్లవాత్మకమైన ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మార్పులు, పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాజధాని ఎంపిక, నిర్మాణం ఉండాలని సమావేశం అభిప్రాయపడింది. కాగా, ఆగస్టు నెలాఖరుకు నివేదిక సమర్పిస్తామని, ఈలోపు ఈనెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతామని శివరామకృష్ణన్‌ వీరికి వివరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశం ప్రశ్నార్థకంగా మారిందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభి ప్రాయాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాజధానిని ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేస్తే రాయలసీమకు దూరం అవుతుందని, రాయలసీమలో ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రకు దూరం అవుతుందని, అందుకే విజయవాడ-గుంటూరు మధ్యలో ఏర్పాటు చేస్తే అందరికీ సమాన దూరంలో ఉంటుందని చెప్పారు. కృష్ణా నది నుంచి సులభంగా నీటిని తీసుకోవచ్చునని చెప్పారు. కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, న్యూఢిల్లీలకు రైలు మార్గం ఉందని, విజయవాడ నుంచి కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌కు నాలుగు లైన్ల జాతీయ రహదారులు ఉన్నాయని, అందుకే అక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామని తెలిపారు. అలాగే, పాలనకు రాజధాని సౌకర్యంగా ఉండాలని, పాలనకు సంబంధించిన అన్ని సంస్థలను విజయవాడ-గుంటూరుల్లో ఏర్పాటు చేస్తామని, రోజువారీ పాలనతో సంబంధం లేని సంస్థలను ఇతర జిల్లాల్లో పెడతామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సచివాలయం నుంచి హైకోర్టుకు వెళ్లి రావాలంటే ఒకరోజు పని వృధా అవుతోందని, కొత్త రాజధానిలో పది నిమిషాల్లోనే సచివాలయం నుంచి హైకోర్టుకు వెళ్లేలా సౌకర్యాలు అభివృద్ధి చేస్తామని, అందుకే అంతర్జాతీయ అనుభవం ఉన్న వ్యక్తులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. రాజధానిని ఎలా నిర్మించాలో, భవనాలను ఎలా డిజైన్‌ చేయాలో రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సూచిస్తుందని, నిర్మాణానికి సాంకేతిక నిపుణులతో మరొక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మూడు నెలల్లోపు భూసేకరణకు కృషి చేస్తామని, ఆరు నెలల్లోపు కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కనీసం రెండు వేల ఎకరాలు అవసరమవుతాయని అభిప్రాయపడ్డారు. విజయవాడ-గుంటూరు మధ్య తుపానుకు ప్రభావితం కాని ప్రదేశంలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: