తెలంగాణ జిల్లాల్లో ప్రయివేటు రంగంలో రకరకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కష్టజీవులు ఆంధ్రప్రదేశ్‌లోని తమ సొంత ఊళ్లకు తిరిగొస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలంగాణ ప్రాంతంలో కాస్తంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుండటంతో ఇంత కాలం అపార్ట్‌మెంట్లలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కుటుంబాలతో పాటు, ఇతర కుల వృత్తులపై ఆధారపడ్డ వారంతా నెమ్మదిగా తమ సొంత ఊళ్లకు తిరిగొస్తున్నారు. ఏళ్ల తరబడి తమను సొంత మనుషులుగా చూసిన వారు కూడా, రాష్ట్ర విభజన తరువాత తమను వేరే రాష్ట్రానికి చెందిన వారుగా చూస్తున్నారని ఇది ఇబ్బందికరంగా ఉందని సొంత ఊళ్లకు తిరిగొచ్చిన వారు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతం నుండి గోదావరి జిల్లాలకు ఎక్కువ సంఖ్యలో తిరిగొస్తున్నారు. ఇలా తిరిగొస్తున్న వారిలో హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లలో పనిచేస్తూ, రాష్ట్ర విభజన కారణంగా కుటుంబాలతో సహా గోదావరి జిల్లాలకు వస్తున్నవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇలా తిరిగొచ్చిన కుటుంబాలు తమ పిల్లలను మున్సిపల్, మండల పరిషత్ పాఠశాలల్లో చేర్చుకునేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. హైదరాబాద్ లేదా ఇతర తెలంగాణ జిల్లాల నుండి సొంత ఊళ్లకు వచ్చిన కుటుంబాలకు చెందిన పిల్లలు బదిలీ సర్ట్ఫికెట్, స్టడీ సర్ట్ఫికెట్‌తో సహా వస్తున్నప్పటికీ కొన్ని పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు రకరకాల నిబంధనలను చూపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అపాయింటెడ్ డే తరువాత తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన విద్యార్ధులు విధిగా ఆయా తెలంగాణ జిల్లాల్లోని జిల్లా విద్యాశాఖాధికారితో సంతకం చేయించుకోవాలని లేని పక్షంలో పాఠశాలలో చేర్చుకునేది లేదని చెబుతున్నారు. ఇంత కాలం తెలంగాణ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో కాయకష్టం చేసుకుంటూ, పిల్లలను అక్కడి పాఠశాలల్లో చదివించుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు, రాష్ట్ర విభజనతో ఒక్కసారిగా తమ సొంత ఊళ్లకు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ డిఇఓ సంతకం కోసం తిరిగి అక్కడికి వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినా సరే తెలంగాణ డిఇఓ సంతకం కావాల్సిందేనని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. 1వ తరగతి నుండి 8వ తరగతిలోపు విద్యార్ధులను పాఠశాలల్లో చేర్చుకోవడానికి ఎలాంటి ఆంక్షలు ఉండవని, బదిలీ సర్ట్ఫికెట్, స్టడీ సర్ట్ఫికెట్ వంటివి లేకపోయినా, విద్యార్ధి పుట్టిన తేది సర్ట్ఫికెట్ లేదా పుట్టిన తేదిని నిర్ధారించే మరేదైనా ఆధారం ఉంటే సరిపోతుందని విద్యాశాఖాధికారి ఒకరు చెప్పారు. 8వ తరగతి వరకు విద్యార్ధులను పాఠశాలల్లో చేర్చుకునే విషయంలో నిబంధనలను మరింత సరళం చేయాలని, లేకపోతే మధ్యలోనే చదువు నిలిపివేసే విద్యార్ధుల సంఖ్య పెరిగిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: