కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయడానికి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం.. టీఆర్ఎస్ నాయకుల్లో గుబులు రేపుతోంది. ఈ ఉద్యమం ఉస్మానియా క్యాంపస్ దాటి ఇతర జిల్లాలకు వ్యాపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుండటంతో టీఆర్ఎస్ నేతలు అంతర్మథనంలో పడ్డారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా పరిగి వంటి చోట్ల కూడా నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు 2008 తర్వాత ఏమీ రాకపోవడంతో ఆగ్రహంగా ఉన్న నిరుద్యోగులు ఈ ఉద్యమం పట్ల ఆకర్షితులైతే.. తమకు తిప్పలు తప్పవని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థుల పాత్ర విస్మరించలేదన్న సంగతిని టీఆర్ఎస్ నేతలు కూడా అంగీకరిస్తారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఓయు విద్యార్థులే ఇప్పుడు ఉద్యోగాల కోసం తెరాస ప్రభుత్వం పైన తిరగబడటం తమ పరువు తీస్తుందని వారు ఆలోచనలో పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం హరీష్‌ రావు, కేటీ రామారావు వంటి నేతలకు రెడ్‌ కార్పెట్‌ పరిచిన విద్యార్థులే, ఇప్పుడు వారిని అడ్డుకుంటున్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రతిపక్షాలు కూడా మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీలు ఇప్పటికే ఆ దిశగా ప్రకటనలు కూడా చేశాయి. ఇదే జరిగితే అధికార పార్టీ ఇబ్బందులు తప్పవు. ఓయూ విద్యార్థుల విషయంలో ఉదాసీనత మంచిది కాదని పలువురు మంత్రులు, సీనియర్‌ నేతలు కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. ఐతే కేసీఆర్‌ దీన్ని అంత సీరియస్ గా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. కావాలని కొన్ని శక్తులు ఇలాంటి ఆందోళనలు చేయిస్తున్నాయని.. ఇది నిజమైన ఆందోళన కాదని ఆయన వారితో చెప్పినట్టు సమాచారం. అయినా ఎందుకైనా మంచిదని.. కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యార్థులు ఇద్దరినీ చల్లబరిచేలా నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే టీఆర్ఎస్ కు భంగపాటు తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: