చంద్రబాబు తీసుకున్న లక్షన్నర రూపాయల రుణమాఫీ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మాఫీ కోసం రకరకాల షరతులు పెడుతున్నా.. ఎలాగైతేనేం లక్షన్నర వరకూ మాఫీ అవుతోంది కదా.. అని చాలామంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయం సాహసోపేతమని అంటున్నారు. ఐతే చంద్రబాబు తెలివిగా మైండ్ గేమ్ ఆడి రైతులను బుట్టలో పడేశారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏంటో పరిశీలిస్తే ఆయన తెలివితేటలు ఇట్టే అర్థమవుతాయి.. అన్నిరకాల రుణాలు మాఫీ చేస్తామంటూ ఆయన ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. వాస్తవానికి ఇప్పుడు ఇచ్చిన హామీని పూర్తిగా అమలు చేయడం లేదు. అంటే మొదటి సంతకానికే ఆయన ఎగనామం పెడుతున్నారు. మరి చంద్రబాబు నిర్ణయంపై రైతుల్లో ఎందుకు అంత వ్యతిరేకత రావడం లేదు. ఎందుకని చంద్రబాబు నిర్ణయంపై చాలామంది రైతులు సంతోషంగా ఉన్నారు. ఈవిషయాన్ని పరిశీలిస్తే.. చంద్రబాబు చాణక్యం ఏంటో అర్థమైపోతుంది. తొలి సంతకం పెట్టినా.. దీనిపై చంద్రబాబు తెలివిగా కోటయ్య కమిటీని వేయించారు. వారితో రోజుకో రకంగా ప్రకటనలు చేయించారు. అసలు చంద్రబాబు మొత్తానికే ఎసరు పెడతారేమో.. అన్న అనుమానం కలిగేలా చేశారు. మెల్లగా జనం లక్షరూపాయలు మాఫీ చేసినా సంతోషమే అనే స్థాయికి ప్రచారం తీసుకొచ్చారు. జనాన్ని మెంటల్ గా ప్రిపేర్ చేశాక కోటయ్య కమిటితో లక్షరూపాయలే మాఫీ చేయించమని సిఫారసు చేయించారు. కోటయ్యకమిటీ లక్షరూపాయలే మాఫీ చేయమన్నా.. చంద్రబాబు దాన్ని లక్షన్నరకు పెంచుతూ రైతుల్లో హీరో అయ్యే ప్రయత్నం చేశారు. ఇలా హామీని పూర్తిగా అమలు చేయకపోయినా..జనంలో వ్యతిరేకత రాకుండా చంద్రబాబు ప్లాన్ చేశారు. దాన్ని విజయవంతం చేయడంలో సక్సస్ అయ్యారు. ఐతే జనం కూడా అంత అత్యాశపరులేం కాదు. లక్షన్నర మాఫీ అయినా వారిలో సంతోషించేవారే ఎక్కువ. లక్షన్నరే చేసినా.. అది పక్కాగా అమలు చేస్తే చాలన్నది వారి వాదన. మొత్తం మీద చంద్రబాబు చాణక్యనీతి ఇలా రైతులపై ప్రయోగించారన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: