వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు వ్యూహాత్మకంగా పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలిచింది పవన్ కల్యాణ్ వల్లనేనంటూ వ్యాఖ్యానించడం మొదలు పెట్టారు. ముందుగా రోజా మొదలుపెట్టిన ఈ వాదనను వైకాపా క్రమంగా ముందుకు తీసుకొళ్లే ఉద్దేశంతో ఉన్నట్టుంది. ఎందుకంటే.. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఉలకనూ ఉలకలేదు, పలకనూ పలకలేదు. పవన్ కల్యాణ్ విషయంలో వైకాపా మాటలకు ఎలా స్పందించినా తెలుగుదేశం పార్టీకే నష్టం. అందుకే ఇప్పుడు పవన్ తో వైకాపా చెలగాటం అడితే.. అది తెలుగుదేశానికి ప్రాణసంకటంగా మారుతోంది. ఇప్పటికే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో రోజా మాటలపై చర్చ మొదలైంది. కొంతమంది ఏమో పవన్ వల్లనే తెలుగుదేశం గెలిచిందని అంటుంటే.. మరికొందరేమో అదేం కాదు, తెలుగుదేశం కు మద్దతునివ్వడం వల్లనే పవన్ కు ఒక గుర్తింపు వచ్చిందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ వ్యవహారంలో ఎటూ స్పందించలేని స్థితిలో ఉంది. అందుకే.. ఇప్పటి వరకూ రోజా మాటలపై తెలుగుదేశం పార్టీ స్పందనలేదు. సాధారణంగా వైకాపా వాళ్లు ఒకటి అంటే.. తెలుగుదేశం వాళ్లు నాలుగు అంటారు. ఆ పార్టీ సీనియర్ నేతలు అనేక మంది వైకాపా వాళ్ల మాటలపై స్పందించడానికే అంకితమై ఉన్నారు. అది కూడా తమ గూటి నుంచి బయటకు వెళ్లిన రోజా వంటి వాళ్లపై విరుచుకు పడటానికి తెలుగుదేశం వైపు నుంచి అనేక చేతులు, నోళ్లు రెడీ గా ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారం గురించి అధికారికంగా స్పందించి లేదు. మరి ఎలా స్పందిస్తే... ఎలాంటి తలనొప్పి వస్తుందో అని తెలుగుదేశం నేతలు మిన్నకుండి పోతున్నారు. మరి వైకాపా ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేస్తుందా.. లేక ఇంకా ముందుకు తీసుకెళ్తుందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: