తాను ఎన్నికల సమయంలో విశ్వసనీయతకు,వంచనకు పోటీ అని పదే,పదే చెబుతూ వచ్చానని, చంద్రబాబు ఇప్పుడు చెబుతున్న మాటలు వంచన చేశారని రుజువు చేసుకున్నారని, తాను చెప్పింది వాస్తవం అని తేలుతోందని అవుతోందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగినందున విడిపోయినందున ఇబ్బందులు వస్తున్నాయని చంద్రబాబు చెబుతున్నారని,అన్యాయం జరుగుతుంటే విభజనకు అనుకూలంగా ఎందుకు ఓటు వేయించారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత, చంద్రబాబు రెండు రాష్ట్రాలకు విడి,విడిగా మానిఫెస్టులు విడుదల చేశారని ఆయన ఆ కాపీలను చూపించారు.ఈ రెండిటిలో ను పూర్తిగా వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని , పూర్తిగా డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పారని , ఎలాంటి కండిషన్ వాటిలో పెట్టలేదని జగన్ అన్నారు.ఎన్నికల కమిషన్ కు ఎన్నికలకు ముందు రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు టిడిపి తన హామీలను అమలు చేస్తుందని , ఆర్ధికంగా ఉండే అంశాలను పరిగణనలోకి తీసుకునే హామీలను చేసినట్లు పేర్కొన్నారని జగన్ తెలిపారు.  ఆ తర్వాత చంద్రబాబు తన మనుషులతో ప్రచారం చేయించి, ప్రతి ఇంటికి ఎంత రుణం ఉందని అడిగి, అవన్ని రద్దు అయిపోతాయని చెప్పారని అన్నారు. బంగారు రుణాలు రద్దు అవుతాయని, ఒకవేళ రుణం తెచ్చుకోకపోతే వెంటనే తెచ్చుకోండని చంద్రబాబు సంతకం చేసిన కరపత్రాన్ని పంపిణీ చేయించారని జగన్ ఆ కాపీని చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: