నరేంద్రమోడీ, చంద్రబాబు జోడీ ఎన్నికలకు ముందు కలసి పనిచేసింది. ఆ తర్వాత వారి కల సాకారమైంది. మోడీ ప్రధాని అయ్యారు, చంద్రబాబు సీఎం అయ్యారు. సమైక్య రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో ఈ పరిణామం ఏపీకి లాభిస్తుందని అంతా ఆశించారు. అందులోనూ ఎన్నికలకు ముందు కేసీఆర్ మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనో సన్నాసంటూ తీవ్రంగా దూషించారు. ఎన్నికల ముందు విమర్శించినా.. మోడీ ప్రధాని కాగానే కేసీఆర్ ఆయనకు నమస్కార భాణం వేశారు. మోడీ ప్రధాని కావడంతో ఇక ఏపీ సీఎం దూకుడుకు పగ్గాలుండవని అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తే.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి ఆశించినంత సహకారం లభిస్తున్నట్టు లేదు. పోలవరం ఆర్డినెన్సు విషయంలో బీజేపీ సహకరించినా.. అది అంతకుముందు యూపీఏ సర్కారు చేసిన నిర్ణయమే. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం అనూహ్యంగా.. తెలంగాణ సీఎంకు కీలకమైన పోస్టు అప్పగించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సదరన్ జోనల్ కౌన్సిల్ వైఎస్ ఛైర్మన్ గా నియమించింది. అంటే కేసీఆర్... దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిల ప్రతినిథిగా ఉంటారు. ఈ నిర్ణయం ఓ రకంగా చంద్రబాబుకు షాకే. ఈ పదవిలో కేసీఆర్ ఏడాది పాటు ఉంటారు. అసలు ఈ పోస్టు ఎందుకంటారా.. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య తలెత్తుతున్న అనేక విషయాల్లో సంప్రదింపులకు వివాదాల పరిష్కారానికి ఇది చక్కని వేదిక. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ అంటే మండిపడే కేసీఆర్.. ఇప్పుడు ఆ రాష్ట్రానికి కూడా ప్రతినిథిగా వ్యవహరించబోవడం విశేషం. గతేడాది ఈ పోస్టులో తమిళనాడు జయలలిత ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదే ఈ పోస్టుకు కేసీఆర్ ను ఎంపిక చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఐతే దీన్ని చంద్రబాబుకు పరాభవంగా భావించాల్సిన అవసరం లేదని.. ఒక్కో ఏడాది ఒక్కో రాష్ట్రానికి ఈ పదవి ఇస్తుంటారని.. దీనికి అంత ప్రాధాన్యం కూడా ఏమీ లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: