అంతర్జాతీయస్థాయిలో తెలంగాణలో 'ఫార్మాసిటీ'ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రపంచంలో చైనా, భారతదేశంలోనే ఫార్మారంగం ఎక్కువగా అభివృద్ధి చెందిందని, భారతదేశంలో తెలంగాణ ప్రాంతమే ఎక్కువ ఉత్పత్తులు అందిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో ఫార్మారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. రైల్వే ట్రాక్స్‌, నేషనల్‌ హైవే, నీటిపారుదల ప్రాజెక్టు అందుబాటులో వున్న ప్రాంతంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 5వేల ఎకరాల్లో ఫార్మా పరిశ్రమలు, మరో రెండువేల ఎకరాల్లో అందులో పనిచేసే ఉద్యోగులకు కాలనీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా నిర్ణయించారు. హైదరాబాద్‌కు సమీపంలో దాదాపు ఏడువేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఫార్మాసిటీపై ఫార్మా కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణలో ఫార్మారంగం, భవిష్యత్తు, ప్రపంచవ్యాప్తంగా వున్న పరిస్థితి తదితర అంశాలను చర్చించారు.  ప్రస్తుతం తెలంగాణలో లక్ష మంది ఫార్మా పరిశ్రమల్లో పనిచేస్తున్నారని, ఫార్మాసిటీ ఏర్పాటైన తరువాత ఐదు లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. 5 లక్షల కుటుంబాలు నివసించే విధంగా ఫార్మాసిటీకి అనుబంధంగా టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఫార్మాసిటీలోనే ఫార్మా అనుబంధ పరిశ్రమలు కూడా వుంటాయని, కాలుష్య రహిత పారిశ్రామిక విధానానికి అనుగుణంగా ఫార్మాసిటీ వుంటుందని, హైదరాబాద్‌లోని జీడిమెట్ల, ఇతర ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమలు కూడా ఫార్మాసిటీకే తరలివెళ్ళాల్సిన అవసరముంటుందని సిఎం సూచించారు. ఫార్మాసిటీకి అవసరమైన భూమి, నీరు, మౌలిక సదుపాయాలతో పాటు 500 మెగావాట్లతో నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఫార్మారంగానికి సంబంధించిన పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా వుందో పరిశీలించాలని, అందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ కన్సల్టెంట్లను పిలిపించి తెలంగాణలో ఫార్మాసిటీ ఏర్పాటుకు డిజైన్‌ చేయాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు.  ఫార్మా పరిశ్రమల వ్యవహారాలను చూసేందుకు ప్రత్యేకంగా ఓ ఐఎఎస్‌ అధికారిని నియమించే విషయాన్ని కూడా ఆయన పరిశీలి స్తున్నారు. తెలంగాణ నుంచి 30శాతం మందులు అమెరికాకు ఎగుమతి అవుతుండగా, మొత్తం రూ.65.16 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవు తున్నాయని, ఇందులో రూ.32.58 కోట్ల విలువైన మందులు ఎగుమతి అవుతున్నాయని లెక్క తేల్చారు. లక్ష మందికి ప్రత్యక్షంగా, 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ఫార్మా పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణబద్ధమై వుంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. సమావేశంలో డ్రగ్‌ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు జయంత్‌ ఠాగూర్‌, ప్రధానకార్యదర్శి ఆర్‌.కె.అగర్వాల్‌, సిఎంఒ ముఖ్యకార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: