ఉద్యోగులు, నిరుద్యోగులకు ఏపీ సర్కారు తీపి కబురు అందించింది. జిల్లాస్థాయి ఉద్యోగాల పదోన్నతులు, నియామకాలపై ఇప్పటివరకూ ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండు వెసులుబాటులకు ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రస్థాయిలోని అన్ని పదోన్నతులు.. కొత్త నియామకాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం గత మే 16న జీవో జారీ చేసింది. ఇప్పుడు ఆ బ్యాన్ ఎత్తేశారన్నమాట. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులు జోరుగా సాగుతాయి. దీని వల్ల కింది స్థాయిలో పోస్టులు ఖాళీ అవుతాయి. దాంతో కొత్త ఉద్యోగాల నియామకాలకూ లైన్ క్లియర్ అవుతుందన్నమాట. అసలు నిషేధం విధించినప్పుడే ఉద్యోగ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. విభజన సమస్య రాష్ట్ర స్థాయి కేడర్లోనే ఉంటుందని.. జిల్లా స్థాయి ఉద్యోగులపై నిషేధం అవసరం లేదని.. వాదించారు. కానీ సర్కారు చెవిన పెట్టలేదు. ఉద్యోగుల వ్యతిరేకత నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ దీనిపై లోతుగా అధ్యయనం చేసింది. జిల్లాస్థాయిలో పనిచేసే ఉద్యోగులపై రాష్ట్ర విభజన ప్రభావం ఏమాత్రం ఉండదని.. కేడర్ విభజన పరిధిలోకి వారు రారని గుర్తించింది. లోకల్ కేడర్ లో నియమితులైన ఉద్యోగులంతా ఆ జిల్లా స్థాయిలోనే ఉంటారనే అభిప్రాయానికి వచ్చింది. ఉద్యోగులు లేవనెత్తిన అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత జిల్లాస్థాయి ఉద్యోగాల పదోన్నతులు, నియామకాలను మినహాయిస్తున్నామని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీలో... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు వందకు పైగా శాఖల్లో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీలు ఇప్పుడు భర్తీ కానున్నాయి. 2 నుంచి 5 వేల వరకు పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ కానున్నట్లు అంచనా. దీని వల్ల వారికి హోదాతోపాటు రెండు ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశముంది. ప్రతి జిల్లాలో పది నుంచి ఇరవై వరకు కారుణ్య నియామకాలకు కూడా మోక్షం లభించనుంది. అన్ని శాఖల్లో భారీగా ఉన్న ఖాళీల్లో ఉద్యోగ నియామకాలకు అవకాశం కలుగుతుంది కాబట్టి... నిరుద్యోగులకు ఇది తీపి కబురే.

మరింత సమాచారం తెలుసుకోండి: